వైకాపా తప్పుడు ప్రచారం వల్లే పోలవరం అంచనాలకు నష్టం వాటిల్లిందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. పాలనా అనుభవం లేకపోవడం వల్లే పోలవరం పనుల్లో జాప్యం జరుగుతోందని అన్నారు. పోలవరం గురించి తెలియకుండానే ప్రభుత్వ పెద్దలు మాట్లాడుతున్నారని విమర్శించారు. 2019 ఫిబ్రవరిలో 55,548 కోట్ల రూపాయలకు కేంద్రం ఆమోదం తెలిపిందని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయాన్ని పోలవరం సందర్శనకు వచ్చినప్పుడు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారని గుర్తు చేశారు.
ఇరిగేషన్ కాంపౌండ్ అంటే భూసేకరణ, ఆర్‌అండ్‌ఆర్ అని నితిన్ గడ్కరీ చెప్పారు. అలాగే నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ రెండుసార్లు అమరావతికి వచ్చారు. ఆయనను పోలవరం, పట్టిసీమ వద్దకు తీసుకెళ్లాం. ఆయన డీపీఆర్-2లో పోలవరం భూసేకరణ, పునరావాసం నిధులు చేర్చారు. పోలవరం విషయాలన్నీ మేం కేంద్ర ఆర్థికశాఖ వద్దకు తీసుకెళ్లాం. వైకాపా ప్రభుత్వం ఎప్పుడూ పోలవరం గురించి ఒత్తిడి తేలేదు. ఏడాదిన్నరలో ఏనాడైనా పోలవరం గురించి అడిగారా?. తెదేపా హయాంలో 71.02శాతం పోలవరం పనులు పూర్తయ్యాయని వైకాపా ప్రభుత్వం ఒప్పుకుంది. అప్పటి నుంచి ఒక్కశాతం పనుల్ని కూడా ముందుకు తీసుకెళ్లకపోగా ఉత్తరకుమార ప్రగల్భాలు పలుకుతున్నారు. తాడేపల్లి రాజప్రసాదంలో నిద్రపోతే పనులుకావు. నిర్వాసితుల తరఫున పోరాట బాధ్యతను తెలుగుదేశం తీసుకుంటుంది. వారికి న్యాయం జరిగే వరకూ అండగా ఉంటాం- దేవినేని ఉమ, మాజీ మంత్రి
ఇదీ చదవండి