Public Serious on Government Land Registration Charges Hike : భూముల విలువ పెరగడంతో ఉమ్మడి కృష్ణా జిల్లాలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు వెలవెలబోతున్నాయి. కృష్ణా జిల్లాలో 12 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో భూముల విలువను 30 శాతానికి పెంచుతూ రిజిస్ట్రేషన్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. బంటుమిల్లిలోని భూముల విలువ 55.5 శాతానికి అధికంగా పెంచగా, ఆ తరువాత ఉయ్యూరు సబ్ రిజిస్ట్రార్ పరిధిలో 42 శాతం అధికంగా పెంచారు. మిగిలిన సబ్ రిజిస్ట్రార్ పరిధిలోని భూముల విలువను 30 శాతం పైగా పెంచారు.
దీంతో బహిరంగ మార్కెట్లో భూముల విలువ మరింత పెరగనుంది. ప్రభుత్వం ఆర్భన్ ప్రాంతాలను కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో భూముల విలువ పెంచడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సొంత ఇల్లు కావాలన్న ఆశతో అప్పులు చేసి ఇల్లు కొనుగోలు చేస్తే దానిని రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే భయంగా ఉందని వారు వాపోతున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం సరైనది కాదని వారు చెబుతున్నారు.
నగరాల్లో అయితే రిజిస్ట్రేషన్లు ఎక్కువగా ఉంటాయని కానీ గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం చాలా తక్కువగా రిజిస్ట్రేషన్లు ఉంటాయని ప్రజలు అంటున్నారు. అటువంటిది గ్రామీణ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని భూ విలువను పెంచడం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం సామాన్య, మధ్య తరగతి ప్రజలపై ఆధనపు భారం పడుతుందని వారు చెబుతున్నారు. అవనిగడ్డ సబ్ రిజిస్ట్రార్ పరిధిలో 32 గ్రామాల్లో 36 శాతం, బంటుమిల్లి సబ్ రిజిస్ట్రార్ పరిధిలో 36 గ్రామాల్లో 55.5 శాతం, చల్లపల్లి సబ్ రిజిస్ట్రార్ పరిధిలో 20 గ్రామాల్లో 32 శాతం, గుడివాడ సబ్ రిజిస్ట్రార్ పరిధిలో 64 గ్రామాల్లో 30 శాతాన్ని ప్రభుత్వం పెంచింది. ఇకా పెంచడం వల్ల తమపై 10 వేలకు పైగా భారం పడుతుందని వారు వాపోతున్నారు.
కంకిపాడు సబ్ రిజిస్ట్రార్ పరిధిలో 32 గ్రామాల్లో పొరంకి, గోసాల, గంగూరు, ఈడుపుగల్లు, కంకిపాడు, పునాదిపాడు, ప్రొద్దుటూరు గ్రామాల్లో మాత్రమే ప్రభుత్వం భూ విలువను పెంచింది. భూముల విలువ పెరగడంతో రిజిస్ట్రేషన్లు చేయించుకునేందుకు ప్రజలు ముందుకు రావడం లేదు. ప్రభుత్వం రిజిస్ట్రేషన్ల విలువను పెంచడం తప్పు కాదని కానీ ఎవరి సలహాలు తీసుకోకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం మంచి పద్దతి కాదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రభుత్వ చర్య సామాన్య ప్రజల కలలపై నీళ్లు చల్లుతుందని ఆరోపిస్తున్నారు.
రిజిస్ట్రేషన్ శాఖను ప్రభుత్వం ఆదాయ వనరుగా మార్చుకుందనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పునరాలోచించాలని ప్రజలు కోరుతున్నారు.
"క్షేత్ర స్థాయిలో ఉన్న రెట్లకి ఇప్పుడు పెట్టిన మార్కెట్ రెట్లకి చాలా వ్యత్యాసం ఉంది. రాత్రికి రాత్రే ధరలను పెంచడం చాలా బాధాకరం. విజయవాడ లాంటి ముఖ్య పట్టణాల్లో పెంచకుండా మధ్య తరగతి ప్రజలు ఉన్న ప్రాంతాల్లో ధరలు పెంచడం చాలా బాధాకరం. దీని మూలంగా ప్రజలు ఇబ్బందలకు లోనవుతున్నారు."- తుమ్మలపల్లి హరికృష్ణ, ఏపీ దస్తావేజు లేఖరుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు