కొండపల్లి కోట చరిత్రను నేటి ప్రజలకు తెలియజేసేందుకు హైదరాబాద్కు చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ.... ఖిల్లాలో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించింది. గురువారం దేదీప్యమైన కాంతుల నడుమ కొండపల్లి కోట చరిత్రను చాటి చెబుతూ లేజర్ షో ప్రదర్శించారు. మహోన్నతమైన కోట ప్రాశస్త్యాన్ని అద్భుతమైన ఘట్టాలను కోట గోడలపై కళ్లకు కట్టేలా చూపారు. అనంతరం నృత్య ప్రదర్శనలు నిర్వహించారు. ప్రముఖ నాట్య కళాకారిణి లీలా శాంసన్ బృందం అభినయించిన శివతాండవం, శ్రీకృష్ణ కేళి నృత్యం సందర్శకులను చూపుతిప్పుకోనివ్వలేదు. ఈ మనోహర దృశ్యాలను తిలకించేందుకు విద్యార్థులు, విజయవాడ వాసులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.
చరిత్ర 'పరంపర'
హైదరాబాద్కు చెందిన పరంపర అనే స్వచ్ఛంద సంస్థ 2015 నుంచి పురాతన ఆలయాలు, కట్టడాల్లో ప్రదర్శనలు ప్రారంభించింది. గుడి సంబరాలు పేరుతో ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాచీన ఆలయాల్లో అనేక ప్రదర్శనలు ఇచ్చింది. మరుగున పడిన చరిత్రను, సంస్కృతిని వెలికితీసి వాటిని కాపాడటమే లక్ష్యంగా ఈ సంస్థ కృషి చేస్తోందని పరంపర వ్యవస్థాపకురాలు డాక్టర్ శ్రీనగి తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేపడుతూ.... భావితరాలకు చరిత్ర గొప్పతనాన్ని తెలుకునే అవకాశం కల్పించాలని సందర్శకులు కోరారు.
ఇదీ చదవండి:'అమరావతిని కదపడం ఎవరికీ సాధ్యం కాదు'