రాజధాని అమరావతిని ముంచే కుట్ర జరుగుతుందని సీఆర్డీఏ పరిధిలోని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశాన్ని సీఆర్డీఏ ( CRDA ) దృష్టికి తీసుకువెళ్లామని అన్నదాతలు పేర్కొన్నారు.
ఉన్నతాధికారులకు ఫిర్యాదు..
విజయవాడ సీఆర్డీఏ ( CRDA ) ఆఫీస్కు వచ్చిన రైతులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశామన్నారు. తమ భూముల్లో ప్రైవేట్ సంస్థలు డ్రిజ్జింగ్ స్టాక్ పాయింట్ల ఏర్పాటు చేశాయని.. కట్ట వెంబడి స్టాక్ పాయింట్ల కోసం గోతులు తవ్వితే కరకట్ట బలహీనపడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇసుక కోసం డ్రెడ్జింగ్..
అనుమతి లేకుండా తమ భూముల్లో డంపింగ్ చేస్తున్నారని.. ఈ క్రమంలో సీఆర్డీఏ కార్యాలయానికి అన్నదాతలు తరలివస్తున్న నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. ఇసుక కోసం ఓ ప్రైవేట్ సంస్థ తమ పొలాల్లో డ్రెడ్జింగ్ ఏర్పాటు చేసిందని అధికారులకు ఫిర్యాదు చేసినట్లు వివరించారు.
మా దృష్టికి రాలేదు : సీఆర్డీఏ
స్పందించిన యంత్రాంగం అనుమతి లేకుండా ఇసుకను తవ్వుతున్న విషయం తమ దృష్టికి రాలేదని చెప్పినట్లు రైతులు వాపోయారు. సర్కారే కరకట్టను బలహీనపరిచి రాజధాని గ్రామాలను ముంచాలని చూస్తోందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలపై ఏమాత్రం ఉపేక్షించకుండా చర్యలు చేపట్టాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. రెండు రోజుల్లో తాము ఆయా ప్రాంతాలను సందర్శించి తగిన నిర్ణయం తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారన్నారు.
ఇవీ చూడండి : 'మూడో దశ ముప్పుపై స్పష్టత లేదు.. అయినా మేం సిద్ధం'