భార్యకు వారంరోజులుగా జ్వరం. వైద్యం కోసం ఏ ఆసుపత్రికి తీసుకెళ్లినా కరోనా పరీక్షలు చేయించుకొని రావాలంటూ సూచిస్తున్నారు. దీంతో విజయవాడ గవర్నర్‌పేటకు చెందిన వృద్ధుడు జ్వరంతో బాధపడుతున్న తన భార్యను తీసుకుని ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానానికి కరోనా పరీక్షల కోసం శనివారం తెల్లవారుజామున వచ్చారు. మధ్యాహ్నం 2 గంటలైనా పరీక్షలు చేయకపోవటంతో.. వృద్ధురాలు దగ్గరలో ఉన్న ఓ చెట్టు వద్ద నీరసంతో కూలబడింది. పక్కనే మురికి నీటికుంట ఉన్నా.. జ్వరం, శ్వాస సమస్యతో అక్కడే పడుకుని ఉక్కిరిబిక్కిరి అయింది. త్వరగా పరీక్ష చేయమని సిబ్బందిని బతిమాలినా.. వేచి ఉండమంటూ చెప్పారంటూ ఆ వృద్ధుడు వాపోయాడు.
విజయవాడ నగరంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. కృష్ణా జిల్లాలో నమోదైన పాజిటివ్ కేసుల్లో 80శాతం కేసులు విజయవాడ నగరంలోనే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో పరీక్షా కేంద్రాల వద్ద ఇలా ఉండటం పట్ల స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వచ్చినవారికి త్వరితగతిన పరీక్షలు చేయాలని కోరుతున్నారు.
ఇదీ చూడండి