కృష్ణా జిల్లాలో రోజు రోజుకూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. కంటైన్మెంట్ జోన్లతో కట్టడి చేసేందుకు జిల్లా యంత్రాంగం ప్రయత్నిస్తున్నా.. కొత్త ప్రాంతాల్లో కేసులు వస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. జిల్లా మొత్తంగా కరోనా పాజిటివ్ కేసులు 500 కు చేరువులో ఉంటే.. వీటిలో ఎక్కువగా విజయవాడ నగరంలో నమోదైనవే. 20 మంది ఈ వైరస్ బారిన పడి చనిపోయారు.
కరోనా నియంత్రణకు అధికారులు కీలక సూచనలు చేస్తున్నా.. ప్రజలు మాత్రం భయం లేదన్నట్లుగా తిరుగుతున్నారు. విజయవాడలోని దాదాపు అన్ని ప్రాంతాలు రెడ్ జోన్, కంటైన్మెంట్, ఆరెంజ్ జోన్ లలోనే ఉన్నా.... ఎక్కడా లాక్డౌన్ నిబంధనలు పాటిస్తున్న దాఖలాలు కనిపించటం లేదు. ఆంక్షలు సడలించిన కారణంగా.. నగరంలో వ్యాపార దుకాణాలు తెరుచుకున్నాయి. రోడ్లన్నీ వాహనాలతో నిండిపోతున్నాయి. ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ సమస్యలు ఏర్పడటంతో పాటు.. బందరురోడ్డు, పటమట, సూర్యారావుపేట, వన్‌టౌన్, పటమట, సింగ్‌నగర్ తదితర ప్రాంతాల్లో వాహన రద్దీ విపరీతంగా పెరిగింది.
మాస్క్ పెట్టుకుంటే సరిపోతుందిలే అన్న రీతిలో చాలామంది వ్యవహరిస్తున్నారు. అందులోనూ కొందరు ద్విచక్రవాహనాలపై వెళ్లేవారు మాస్కులు ధరించటం లేదు. చాలా మంది ఫోన్ వచ్చినప్పుడు మాస్కులను తొలగించి మాట్లాడుతున్నారు. ప్రస్తుతం వైరస్ లక్షణాలు వెంటనే బయటపడని కారణంగా.. చాలా మంది బయట తిరుగుతున్నారు. వైరస్ ఎటు నుంచి ఎటు వ్యాపిస్తుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు.. అప్రమత్తంగా ఉంటేనే కరోనాను జయించగలం.
ఇదీ చదవండి: