రాష్ట్రంలోని క్షౌరవృత్తిదారులపై కరోనా ప్రభావం తీవ్రంగా పడింది. నాయీ బ్రాహ్మణ కుటుంబాల్లో 90 శాతం మంది కులవృత్తిలోనే ఉన్నారు. ఒక్క విజయవాడ పరిధిలోనే వేల మంది సెలూన్లలో పనిచేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2 లక్షల మంది మొత్తంగా పది లక్షల మందికి క్షౌరవృత్తే అన్నం పెడుతోంది. భౌతికదూరం కచ్చితంగా పాటించాలన్న నిబంధనతో సెలూన్ల మూసివేత అనివార్యంగా మారింది. 2 నెలల నుంచి అందరూ ఇంటి వద్దే ఉంటున్నారు. షాపుల అద్దెల కోసం ఒత్తిడి పెరిగింది. కరెంటు బిల్లులు చెల్లించడం ఇబ్బందికరంగా ఉందని, సరకుల కొనుగోళ్లు, కుటుంబ పోషణ భారంగా మారిందని పలువురు ఆవేదన చెందుతున్నారు.
సెలూన్లు ఉన్నఎక్కువ మంది బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని నడుపుతున్నారు. ఇప్పుడు వీరిపై కరోనా పిడుగు పడింది. బాగా చదువుకున్న పలువురు ఉద్యోగం దొరక్క సెలూన్లలో పనిచేస్తున్నారు. విద్యార్థులు కొందరు చదువు ఖర్చులు, వసతిగృహాల అద్దెల కోసం క్షౌరవృత్తి చేస్తున్నారు. దేవాలయాలు మూతపడటంతో రాష్ట్రవ్యాప్తంగా కల్యాణకట్టల వద్ద ఉన్న 15వందల మంది నాయీ బ్రాహ్మణులకు పనులు నిలిచిపోయాయి. క్షౌరవృత్తికి అనుబంధంగా ఉన్న వాయిద్య కళాకారులదీ అదే పరిస్థితి. రెండు పనులూ చేసుకునేవారికి ఇప్పుడు ఏపనీ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా అందరి జీవితాలనూ కరోనా అతలాకుతలం చేసింది.
ప్రభుత్వ ఇతర దుకాణాలకు అనుమతులు ఇచ్చిన మాదిరే తమకూ కొంత సమయం పాటు సెలూన్లు తెరిచేందుకు వెసులుబాటు కల్పించాలని నాయీ బ్రాహ్మణులు కోరుతున్నారు.
ఇవీ చదవండి