కృష్ణా జిల్లాలో కోవిడ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడంలో ప్రజలు అనుసరిస్తున్న సురక్షిత మార్గాలు దోహదపడ్డాయని జిల్లా కలెక్టరు ఎండీ ఇంతియాజ్ అన్నారు. జిల్లాలో కోవిడ్ వైరస్ వ్యాప్తి నియంత్రణకు జిల్లా యంత్రాంగం తీసుకున్న చర్యలను ఆయన వివరించారు. ఒకప్పుడు జిల్లాలో భారీ సంఖ్యలో కోవిడ్ కేసులు నమోదుకాగా..ఇప్పుడు ఈ కేసులు తగ్గాయి.
మార్చి 23వ తేదీన జిల్లాలో మొదటి పాజిటివ్ కేసు నమోదైంది. 5 నెలల కాలంలో వైరస్ వ్యాప్తి నియంత్రణపై పలు జాగ్రత్తలను తీసుకున్నామని కలెక్టర్ తెలిపారు. పటిష్టమైన చర్యల కారణంగా కొవిడ్ పాజిటివ్ కేసుల నమోదులో...కృష్ణా జిల్లా చివరి స్థానంలో నిలిచిందన్నారు. ఇందుకు సహకరించిన ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. జిల్లాలో ఇటీవల నిర్వహించిన సెరా సర్వైలెన్స్ అధ్యయనంలో జిల్లాలో 20 శాతానికి పైగా ప్రజలకు కోవిడ్ వైరస్ వచ్చి వెళ్లిపోయిందని... ఈ విషయం వారికి కూడా తెలియదన్నారు.
మే నెలలో విజయవాడలోని కృష్ణలంక, కొత్తపేట, జక్కంపూడి, తదితర ప్రాంతాలలో పరీక్షించగా... 40 శాతం మంది ప్రజలకు వారికి తెలియకుండానే కోవిడ్ వైరస్ వ్యాధిసోకి నయమైందని అధ్యయనంలో తేలిందన్నారు. జిల్లాలో వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టినప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. కరోనా వ్యాధి లక్షణాలు లేనప్పటికీ కొంతమంది వ్యక్తులలో రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు తగ్గడం కారణంగా ప్రమాద పరిస్థితికి చేరుకుంటున్నారన్నారు. ప్రతీ ఒక్కరూ రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు పరీక్షించుకుని , తక్కువ స్థాయిలో ఉన్నవారు వెంటనే వైద్య చికిత్స పొందాలన్నారు. కరోనా పరీక్షలకు ఎవరూ సంకోచించవద్దని , ప్రతీ ఒక్కరూ వైద్యపరీక్షలు చేయించుకున్నట్లయితే వ్యాధిని ప్రారంభంలోనే తగ్గించుకోవచ్చన్నారు. రాష్ట్రంలోనే అత్యధికంగా కృష్ణాజిల్లాలో అత్యధిక కరోనా టెస్టులు నిర్వహించామని.. ఇంతవరకు 3 లక్షల 973 కరోనా టెస్టులు చేసినట్లు కలెక్టరు ఇంతియాజ్ తెలిపారు.
ఇదీ చూడండి.
శానిటైజర్లు తాగి అస్వస్థత..చికిత్స పొందుతూ అటెండర్ మృతి