దేశ చరిత్రలో సెప్టెంబర్ 20 మాయని మచ్చగా మిగిలిపోతుందని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు వివిధ రైతు సంఘాల ప్రతినిధులు, పార్టీల నాయకులు, అమరావతి పరిరక్షణ సమితి నేతలు పాల్గొన్నారు.
రైతులకు తీవ్ర నష్టం
కేంద్ర తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లుల వలన రైతులు, రైతు కూలీలు తీవ్రంగా నష్టపోతారన్నారని వడ్డే శోభనాద్రీశ్వరరావు అన్నారు. బిల్లు పాస్ చేసేముందు సెలెక్ట్ కమిటీకి పంపి రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకుని ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. అలాకాకుండా ఏకపక్షంగా పాస్ చేయడం సరికాదన్నారు. పక్క రాష్ట్రంలోని తెరాస.. బిల్లులను వ్యతిరేకిస్తుంటే మన రాష్ట్రంలోని వైకాపా, తెదేపాలు మద్దతివ్వడం దుర్మార్గ చర్య అని అన్నారు.
మెజారిటీ లేకపోయినా పాస్ చేయించుకున్నారు
రాజ్యసభలో భాజపాకు మెజారిటీ తక్కువగా ఉన్నప్పట్టికీ మూజువాణి ఓటుతో ఆమోదింపజేసుకోవడం చూస్తుంటే.. భవిష్యత్తులోనూ ఇలాగే బిల్లులు పాస్ చేయించుకునేలా ఉన్నారని సీపీఎం మధు మండిపడ్డారు. ముఖ్యమంత్రి దిల్లీ పర్యటన వివరాలు బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు.
వైకాపా రాష్ట్రాన్ని నాశనం చేస్తోంది
యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీగా చెప్పుకునే వైకాపా.. రైతు ప్రయోజనాలు విస్మరించి రైతాంగ వ్యతిరేక బిల్లులకు రాజ్యసభలో ఆమోదం తెలపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి నాయకులు శ్రీనివాస్ అన్నారు. ఇప్పటికే మూడు రాజధానుల పేరుతో రాష్ట్ర అభివృద్ధి కుంటుపడేలా చేసి.. ఇప్పుడు వ్యవసాయ బిల్లులకు ఆమోదం తెలిపి రాష్ట్రాన్ని ఇంకా ఎన్ని రకాలుగా నాశనం చేయాలో చర్చించేందుకే ముఖ్యమంత్రి కేంద్ర మంత్రి అమిత్ షాతో బేటీ అయ్యారని ఆరోపించారు.
ఇవీ చదవండి...