కృష్ణాజిల్లా వత్సవాయి మండలంలోని లింగాల గ్రామంలో మునేరు వరద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. వరద ప్రాంతాలను జిల్లా కలెక్టర్ ఇంతియాజ్, ఎస్పీ రవీంద్రనాథ్ బాబు, స్థానిక శాసనసభ్యులు సామినేని ఉదయభాను పరిశీలించారు.
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కృష్ణాజిల్లాలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉందని కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు. రెండు రోజులుగా విజయవాడ ప్రకాశం బ్యారేజ్ నుంచి రోజుకు 1.35 లక్షల క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి విడుదల చేసినట్లు తెలిపారు. తెలంగాణ ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు మున్నేరు వరద పోటెత్తిన విషయాన్ని చెప్పారు.
మున్నేరుకు గరిష్టంగా 1.10 లక్షల క్యూసెక్కుల వరద వచ్చిందని కలెక్టర్ అన్నారు. కృష్ణ, మున్నేరు నదీ పరివాహక ప్రాంతాల్లో ఎటువంటి ఇబ్బందులు ఎదురుకాకుండా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉందన్నారు. అవసరమైన చోట్ల బోట్లు ఏర్పాటు చేశామన్నారు. ఏదైనా ఘటన జరిగి సహాయ చర్యలు అవసరమైతే సిబ్బందిని అప్రమత్తంగా చేశామన్నారు. రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను అన్నారు.
ఇదీ చదవండి: అల్పపీడన ప్రభావం.. జోరుగా ఒకటే వాన..