ఎస్ఈసీ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వ వైఖరి సరిగాలేదనటంతో పాటు ఇటువంటి ఆర్డినెన్స్‌ను ఎలా ఆమోదిస్తారన్న సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యలకు సీఎం జగన్ ప్రజలకు సమాధానం చెప్పాలని తెదేపా నేత దేవినేని ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. రాజ్యాంగ వ్యవస్థలతో ఆటలాడొద్దని జగన్‌కు సుప్రీంకోర్టు స్పష్టం చేయటంతో పాటు ఎస్ఈసీ రమేష్ కుమార్ తొలగింపునకు సంబంధించిన ఆర్డినెన్స్ దురుద్దేశ పూర్వకంగా ఉందని సుప్రీం తేల్చి చెప్పిన సంగతి జగన్ గ్రహించాలని ఆయన హితవు పలికారు.
మరోవైపు పంట నష్టాలతో, అమ్ముడుగాని ఉత్పత్తులతో అన్నదాతల ఆత్మహత్యలు బాధాకరమని ఉమా ఆవేదన వ్యక్తం చేశారు. అప్పుల బాధలతో తనువులు చాలిస్తున్న రైతన్నల బాధలు తాడేపల్లి రాజప్రసాదానికి వినిపిస్తున్నాయా? అని నిలదీశారు. విశాఖ మన్యంలో మంత్రి మేనల్లుడి మైనింగ్ మాఫియా.... లేటరైట్ ముసుగులో బాక్సైట్ తరలిస్తోందని ఆయన ఆరోపించారు. సీఎం జగన్ సొంత కంపెనీ సరస్వతి పవర్‌కి 50ఏళ్ల లీజుపొడిగింపు బరితెగింపు చర్యని ఆక్షేపించారు.