CM JAGAN WARNING TO MLAs: గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో నేతలెవరూ నిర్లక్ష్యానికి తావివ్వవద్దని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. పనితీరు ఆధారంగానే వచ్చే ఎన్నికల్లో సీట్లు కేటాయింపు ఉంటుందని స్పష్టం చేశారు. పలుమార్లు చెప్పినా ఇంకా మంత్రులు, ఎమ్మెల్యేలు వెనుకంజలోనే ఉన్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల నాటికి పరిస్ధితి మారకపోతే వేటు తప్పదని 32 మంది నేతలకు గట్టిగా చెప్పారు.
గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వెనుకబడిన వైకాపా ఎమ్మెల్యేలకు సీఎం జగన్ మరోసారి గట్టి హెచ్చరికలు చేశారు. ఈ కార్యక్రమంపై తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమీక్షించిన సీఎం... నియోజకవర్గాల వారీగా చేసిన సర్వే వివరాలు వెల్లడించారు. 32 మంది ఎమ్మెల్యేలు 40రోజుల కంటే తక్కువ గడపగడపకూ తిరిగారని తెలిపారు. చాలా మంది సరాసరిన 32 రోజులు కూడా వెళ్లలేదన్నారు. అతి తక్కువగా తిరిగిన వారిలో మంత్రులు బొత్స, అప్పలరాజు, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, విడదల రజినీ, గుడివాడ అమర్నాథ్, మాజీమంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, కందుకూరు ఎమ్మెల్యే మహీధర్‌రెడ్డి, తంబళ్లపల్లె ఎమ్మెల్యే ద్వారకానాథ్‌రెడ్డి, దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్, నిడదవోలు ఎమ్మెల్యే శ్రీనివాసులు నాయుడు, కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు ఉన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం పట్ల నిర్లక్ష్యం వద్దన్న ముఖ్యమంత్రి.. అలసత్వం వహించిన వారు నష్టపోతారని హెచ్చరించారు. రాష్ట్రంలో పేదలు, పెత్తందార్ల మధ్య యుద్ధం జరుగుతుందన్న ఆయన... వైకాపా అధికారంలోకి రాకుంటే పేదవాడికి న్యాయం జరగదన్నారు.
పార్టీలో గృహసారథులు, సచివాలయ కో-ఆర్డినేటర్ల నియామకానికి సంబంధించి విధివిధానాలను సీఎం నేతలకు వెల్లడించారు. నాయకత్వం వహించే సామర్థ్యం ఉన్న కార్యకర్తలనే సచివాలయ కన్వీనర్లుగా నియమించాలని ఆదేశించారు. సచివాలయాల కన్వీనర్లుగా ఎమ్మెల్యేలకు ఇష్టం వచ్చిన వారిని నియమించుకోవచ్చని.. వారు సమర్థులై ఉండాలన్నారు. వారికి తప్పనిసరిగా స్మార్ట్‌ఫోన్ ఉండి తీరాలని.. ఎక్కడా వాలంటీర్లు గృహసారథులుగా ఉండకూడదని స్పష్టం చేశారు. ఎంపిక చేసినవారు 50 ఇళ్లకు సంబంధించిన వారై ఉండాలన్నారు. కన్వీనర్ల నియామకం తర్వాత గృహ సారథుల నియామకం జరుగుతుందని చెప్పారు. జనవరి 20లోపు నియామకం పూర్తి కావాలని సీఎం నిర్దేశించారు. గ్రామాల్లో అత్యధిక ప్రభావం చూపే పనులనే గుర్తించాలని... ఎక్కడా స్వప్రయోజనాలు ఆశించవద్దని సీఎం ఆదేశించారు.
'గడపగడపకు మన ప్రభుత్వంలో పెర్ఫార్మెన్స్ బాగుంటేనే వచ్చే ఎన్నికల్లో అభ్యర్థులుగా ఉంటారని సీఎం తెలిపారు. ముఖ్యమైన కార్యక్రమం కాబట్టి సీరియస్‌గానే సీఎం సమీక్షించారు. వచ్చే మార్చిలో మరోసారి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై సమీక్ష నిర్వహించాలని సీఎం ఆదేశించారు. ఆలోపు అందరూ పనితీరు మెరుగుపరచుకోవాలని సీఎం సూచించారు.' - సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ సలహాదారు