CM YS Jagan: ప్రపంచ కమ్యూనిస్టుల చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా చంద్రబాబు బినామీల భూములకు ధరలు పెంచడానికి కామ్రేడ్‌లు జెండాలు పట్టుకునే దుస్థితి వచ్చిందని ముఖ్యమంత్రి జగన్ మండిపడ్డారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కాలేదన్న బాధ, కడుపుమంట ఉన్న కమ్యూనిస్టులు, మరికొందరు మాత్రమే ఉద్యోగులు సమ్మె చేయాలని కోరుకుంటున్నారని ఆయన ధ్వజమెత్తారు.
‘‘రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు సమ్మె చేయాలని... ప్రజలు, ప్రభుత్వం, ఉద్యోగుల్లో ఎవరూ కోరుకోరు. ఈ రెండున్నరేళ్లలో బటన్ నొక్కి డీబీటీ ద్వారా వివిధ పథకాల రూపంలో ప్రజలకు రూ.1.27 లక్షల కోట్లు అందజేశాం. వాటితో లబ్ధిపొందిన ఏ కుటుంబం, సామాజికవర్గం సమ్మె కోరుకోదు. మరి సమ్మె, ఆందోళన ఎవరికి కావాలో తెలుసా? చంద్రబాబు సీఎం కాలేదన్న కడుపుమంట ఉన్నవారికి, ఎర్రజెండాల వారికి, బాబు దత్తపుత్రుడికి కావాలి. ఉద్యోగులతో సంధి జరిగింది, వాళ్లు సమ్మెకు వెళ్లడం లేదంటే... వీళ్లకు నచ్చలేదు. ఏడుపు ముఖం పెట్టారు. ఉద్యోగులు సమ్మె విరమించారని తెలియగానే.... పచ్చ జెండాలు మోస్తున్న పచ్చబాబు, పచ్చజెండా ముసుగులో ఉన్న ఎర్ర సోదరుల్ని ముందుకి తోశారు. ముందు ఎర్రజెండా, వెనుక పచ్చ ఎజెండా. ఇదీ రాష్ట్రంలో పరిస్థితి’’ అని సీఎం తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మంగళవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో కంప్యూటర్ బటన్ నొక్కి... జగనన్న చేదోడు పథకం కింద లబ్ధిదారుల ఖాతాల్లో రూ.10 వేల చొప్పున ఆయన జమ చేశారు.
టీచర్లను రోడ్డెక్కిస్తే పిల్లల చదులేం కావాలి?
‘‘ఉద్యోగుల సమస్య సామరస్యంగా పరిష్కారమయ్యాక, ఆ ప్రక్రియలో భాగస్వాములైన వామపక్షాలకు సంబంధించిన సంఘాలు సంతకాలు పెట్టి, సంతోషం వెలిబుచ్చాయి. ఆ మర్నాటి నుంచి వామపక్షాలు, పచ్చ పార్టీలకు సంబంధించిన సంఘాలు పోరుబాట పడతామని, రోడ్డెక్కుతామని అంటున్నాయి. కొవిడ్‌తో రెండేళ్లుగా పిల్లలకు పరీక్షలు పెట్టలేదు. మూడో సంవత్సరం పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో కొందరు కేవలం ప్రభుత్వం మీదికి ఉసిగొల్పాలన్న ఉద్దేశంతోనే టీచర్లను రోడ్డెక్కిస్తే పిల్లల చదువులేం కావాలి?’’ అని ముఖ్యమంత్రి మండిపడ్డారు.
ప్రతిపక్షాలకు పండగే...
CM YS Jagan slams opposition parties: జగనన్న చేదోడు పథకం రెండో విడత నిధుల విడుదల కార్యక్రమంలో మాట్లాడిన సీఎం.. ప్రతిపక్షాల తీరును తప్పుబట్టారు. అమరావతిలో పేదలకు భూములు కేటాయిస్తే అడ్డుకున్నారని విమర్శించారు. ఉద్యోగులు సమ్మెకు వెళ్లాలని ఎవరూ కోరుకోవట్లేదని.. కానీ అలా జరిగితే ప్రతిపక్షాలకు పండుగే అని దుయ్యబట్టారు. ఉద్యోగులు సమ్మెలో పాల్గొనట్లేదని తెలిసి ప్రతిపక్షాలు నిరాశ చెందాయంటూ సెటైర్లు విసిరారు.
"ఉద్యోగులు సమ్మెకు వెళ్లాలని ఎవరూ కోరుకోవట్లేదు. అలా సమ్మెలోకి వెళ్తే ప్రతిపక్షాలకు పండుగే. ఉద్యోగులు సమ్మెలో పాల్గొనట్లేదని తెలిసి నిరాశ చెందారు. కమ్యూనిస్టులు ఉద్యోగులను ముందుంచి ఆందోళన చేయిస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కమ్యూనిస్టుల ఆందోళనలు చేస్తున్నారు. రాజకీయాలను కలుషితం చేసి విచ్చిన్నం చేసేందుకు యత్నిస్తున్నారు" - ముఖ్యమంత్రి జగన్
ఇదీ చదవండి: