జానపదాలతో సహా అనేక కళాప్రదర్శనలకు ఒకప్పుడు గ్రామీణప్రాంత ప్రజలు బ్రహ్మరథం పట్టేవారు. సినిమానూ అదే స్థాయిలో ప్రేమించేవారు. అందుకే ఆ ప్రాంతాల్లో సినిమా థియేటర్లు ఓ వెలుగు వెలిగాయి. సినిమా చూసేందుకు అవసరమైతే అప్పట్లో కొన్ని కిలోమీటర్లు నడిచి... ఎడ్లబండిమీద వెళ్లి మరీ సినిమాలు చూసేవారు. ఇంటిల్లిపాదితో కలసి సినిమాకు వెళ్లడమనేది అప్పట్లో ఓ పండుగలా ఉండేది. ఇప్పుడు కాలం మారింది. ఆ సందడి తగ్గింది. అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్‌తోపాటు..... మొబైల్ ముంగిట్లో పైరసీ వంటి కారణాలతో ప్రస్తుతం పల్లెవాసులు సినిమాల కోసం థియేటర్ల వైపు చూడ్డం తగ్గించేశారు. ఆధునిక సాంకేతికతను అందుకోలేక, నిర్వహణ ఖర్చులూ దక్కించుకోలేక... థియేటర్లన్నీ ఒక్కొక్కటిగా మూతపడుతున్నాయి.
కృష్ణా జిల్లా అవనిగడ్డలో ఇదే పరిస్థితి నెలకొంది. సినిమా టికెట్టు కోసం ప్రేక్షకులు గంటల తరబడి వేచి ఉన్న రోజుల నుంచి... ఎవరైనా టికెట్టు కొంటారా అని థియేటర్‌వాళ్లే ఎదురుచూసే పరిస్థితి నెలకొంది. డీటీఎస్, ఏసీ వంటి సౌకర్యాలను గ్రామీణ ప్రాంత థియేటర్లలో కల్పించలేకపోతున్నారు. ఖర్చు ఎక్కువైనా.... అధునాతన థియేటర్లలోనే చూసేందుకు పల్లెవాసులు ఇష్టపడుతున్నారు. ప్రేక్షకుల ఆదరణ తగ్గడం వల్లనే అవనిగడ్డ నియోజకవర్గ పరిధిలో 50 శాతం థియేటర్లు మూతపడ్డాయి. ఇప్పుడు ఘంటశాలలో ఒక్క థియేటరూ లేదు.
చల్లపల్లిలో ఇప్పటికే రెండు హాళ్లు మూతపడగా... మరో రెండు ఆట నిలిపేయడానికి సిద్ధంగా ఉన్నాయి. అవనిగడ్డలోనూ దాదాపు ఇదే పరిస్థితి ఉంది. నాగాయలంకలో ఓ థియేటర్ పాఠశాలగా మారింది. జీఎస్టీ , నిర్వహణ భారం పెరగడం వల్లనే మూసేస్తున్నామని యజమానులు చెబుతున్నారు. కొత్త సినిమాలకూ.. మొదటిరోజు కొన్ని ప్రాంతాల్లో 200 మంది మించి ప్రేక్షకులు రావట్లేదని ఆవేదన చెందుతున్నారు. విద్యుత్ రాయితీ లేదా పన్ను మినహాయింపు ఇచ్చి ఆదుకోవాలని థియేటర్ నిర్వాహకులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.