ముఖ్యమంత్రి జగన్ వల్ల వర్షాలు కురుస్తున్నాయని మంత్రి కన్నబాబు చెప్పడం హాస్యాస్యపదంగా ఉందని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు నిమ్మకాయల చినరాజప్ప ఎద్దేవా చేశారు. అలా అయితే రాష్ట్రంలో కరోనా కేసులు సీఎం వల్లే పెరుగుతున్నాయని అంగీకరిస్తారా అంటూ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్ మాటల్లో రైతు సంక్షేమం కాదు రైతు ద్రోహం ఉన్నదని ఆరోపించారు. 20వేల కోట్ల రూపాయల బడ్జెట్ లో కేవలం 7వేల కోట్లు మాత్రమే రైతులకు ఖర్చు చేయటం ద్రోహం కాదా అంటూ నిలదీశారు.
సీఎం జగన్ ఏడాది పాలనలో 600 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని నిమ్మకాయల చినరాజప్ప ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ సబ్ ప్లాన్ కు చంద్రబాబు హయాంలో 2018-19లో 9వేల కోట్లు ఖర్చు చేస్తే.. జగన్ రెడ్డి 2019-20లో కేవలం 4,700 కోట్లు ఖర్చు పెట్టారన్నారు. బీసీల రిజర్వేషన్ 34 శాతం నుంచి 24 శాతం తగ్గించి.. బీసీ నాయకులపై అక్రమంగా కేసులు పెట్టి దాడులు చేస్తుంది కన్నబాబుకు కనపడటం లేదా అని వ్యాఖ్యానించారు.
ఇదీ చదవండి: వైద్యం ఖర్చు రూ.వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ..