సింహాచల దేవస్థానంలోని గోశాలలో గోవుల మృతి విచారకరమని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. ఇది అశుభమని వ్యాఖ్యానించారు. ఉన్నపళంగా గోవుల సరంక్షణ విధుల్లో ఉన్నవారిని తొలగించినందువల్లే గోవులు మరణించినట్టు తెలుస్తోందని ఆరోపించారు. కుటిల రాజకీయ కుట్రలకు మూగజీవాలను బలి తీసుకోవడం అమానుషమన్నారు. వంశపారంపర్యంగా వస్తున్న ఆచారాలు, సంస్కృతి, నిర్వహణ విషయాల్లో ప్రభుత్వాలు దురుద్దేశంతో.. స్వార్థంతో జోక్యం చేసుకుంటే ఇలాంటి అనర్థాలే జరుగుతాయని హెచ్చరించారు.
ప్రజల మనోభావాలను గౌరవించి ఇప్పటికైనా గోవుల సంరక్షణకు చర్యలు తీసుకోవాలని చంద్రబాబు సూచించారు. తొలగించిన ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇదివరకు తాడేపల్లి గోశాలలో 100 గోవులు మృతి చెందితే.. చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. భారతీయ సంస్కృతిలో ఎంతో ప్రాధాన్యం ఉన్న గోవుల పట్ల ప్రభుత్వం ఇలా నిర్లక్ష్యంగా ఉండటం ఏంటనీ మండిపడ్డారు. దీనికి సంబంధించిన వీడియోను చంద్రబాబు తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
ఇదీ చదవండి: ముగిసిన రాష్ట్ర కేబినెట్ భేటీ..కీలక అంశాలపై చర్చ