వైకాపా ప్రభుత్వం దుర్మార్గ పాలన సాగిస్తోందని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ప్రభుత్వం దొడ్డిదారిన బిల్లులు ఆమోదించుకునేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. జూమ్ యాప్ ద్వారా మీడియాతో మాట్లాడిన ఆయన...అధికార పార్టీ నేతలు సభలో కనీస సంప్రదాయాలు పాటించట్లేదని దుయ్యబట్టారు. అసెంబ్లీలో వైకాపాకి మెజార్టీ ఉంటే... మండలిలో తెదేపాకి బలం ఉందని అన్నారు. లోక్‍సభలో ఆమోదం పొంది రాజ్యసభలో ఆగిన బిల్లులు చాలా ఉన్నాయని గుర్తు చేశారు. కొందరు మంత్రులు ఇష్టానుసారం మాట్లాడారని ధ్వజమెత్తారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మిగతా పార్టీల వాళ్లను నామినేషన్ వేయకుండా చేశారని ధ్వజమెత్తారు.
ఎన్నో రోజులుగా అమరావతిలో ఆందోళనలు జరుగుతున్నా ప్రభుత్వం వాటిని పట్టించుకోవటం లేదని చంద్రబాబు మండిపడ్డారు. ఆడబిడ్డల మీద దాడులు చేస్తూ అమరావతి ప్రాంత రైతులను హింసిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధానిని తరలించే నిర్ణయం మూర్ఖపు చర్యగా అభివర్ణించారు. వైకాపా సర్కార్ మీడియా స్వేచ్ఛకు భంగం కలిగిస్తోందన్న చంద్రబాబు.... నియంత, ఉన్మాద పాలన సాగిస్తే చూస్తూ సహించాలా అని నిలదీశారు.నలుగురు మాజీ మంత్రులపై అక్రమ కేసులు పెట్టారని మండిపడ్డారు. రాష్ట్రంలో కరోనా కట్టడిలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.
ఇదీ చదవండి