లాకప్ డెత్ లు, అక్రమ కస్టడీలు వంటి ఆరోపణల దృష్ట్యా.. రాష్ట్ర వ్యాప్తంగా ఠాణాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. మొదటి దశ ప్రాజెక్టుగా కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు పోలీస్స్టేషన్లో లాకప్ గదిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. పోలీసుల విధుల్లో పారదర్శకత పెంచేందుకు స్టేషన్‌లలో సీసీకెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. మార్చి నెలాఖరు నాటికి పూర్తవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆ దిశగా పనులను యుద్ధ ప్రాతిపదికన నిర్వహిస్తున్నారు.
పోలీస్ స్టేషన్లలో సీసీకెమెరాలు అమర్చాలని గతేడాది డిసెంబరులో సుప్రీంకోర్టు తీర్పుతో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే 10 కోట్ల రూపాయల వ్యయంతో మొదటి దశ ప్రాజెక్టును చేపట్టారు. ఇందులో భాగంగా పెనుగంచిప్రోలు స్టేషన్‌లోని లాకప్ గదిలో సీసీ కెమెరాలు అమర్చుతున్నారు. ఇందులో ఎక్కువ కాలం బ్యాకప్ ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ప్రవేశ ద్వారం, పార్కింగ్, ప్రాంతాల్లో రెండవ దశలో కెమెరాలు ఏర్పాటు చేస్తామని అధికారులు చెబుతున్నారు.
1372 పోలీస్ స్టేషన్‌లలో కెమెరాలు..
తొలిదశలో ప్రతి స్టేషన్‌లో... స్త్రీ, పురుషుల లాకప్‌లకు ఒక్కొక్కటి చొప్పున కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం 1372 పోలీస్ స్టేషన్‌లలో కెమెరాలను అందుబాటులోకి తీసుకురానున్నారు. రెండో దశకు సంబంధించిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి డీజీపీ నివేదిక పంపనున్నారు. ఇందులో అమర్చనున్న సీసీకెమెరాల్లో ఆడియో కూడా రికార్డు అవుతుందని అధికారులు చెబుతున్నారు.
ఇదీ చూడండి: