వ్యవసాయం, సేద్య పద్ధతులు, విధానాల గురించి అన్ని అన్ని విద్యాలయాల్లోనూ చర్చ జరగాలని.. పాఠశాల దశ నుంచే పిల్లలకు వ్యవసాయ విజ్ఞానాన్ని అందించాలని సీబీఐ పూర్వ సంయుక్త సంచాలకులు లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు. ఇలా నేర్పించడం వల్ల సమాజం ఆరోగ్యవంతంగా ఉంటుందని వెల్లడించారు. అలాగే జాతీయ విద్యావిధానంలో "చేస్తూ.. నేర్చుకోవడం" అనే అంశం ఉందని తెలిపారు. అందులో భాగంగానే వ్యవసాయానికి విద్యలో తగిన ప్రాధాన్యం ఇవ్వడం అత్యవసరమని లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. విజయవాడ అయ్యప్పనగర్‌లోని స్వచ్చంద సంస్థ సీడ్ బర్డ్ ఫార్మ్ ఆధ్వర్యంలో చేపడుతున్న నగరాల్లో.. పంట పొలాల నిర్వహణ, సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించడం, పాఠశాలల్లో పిల్లలకు విత్తనాలను అందించి వారిలో మొక్కల పెంపకంపై అవగాహన కల్పించే కార్యక్రమాలను లక్ష్మీనారాయణ ప్రత్యక్షంగా పరిశీలించారు. నిర్వాహకులతో చర్చించారు. వారి ఆలోచనలకు జాయింట్ ఫర్ డెవలప్‌మెంట్ ఫౌండేషన్ ద్వారా తనవంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.
ఆరోగ్యవంతమైన ఆహారం అందుబాటులో లేనందునే అనేకమంది ప్రాణాంతక వ్యాధుల బారిన పడుతున్నారని లక్ష్మీనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. అనేకమంది విద్యావంతులైన యువత ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించే.. తమ ఉద్యోగాలను వదిలి పొలం బాట పడుతున్నారని చెప్పారు. తల్లిదండ్రులు తమ పిల్లల మార్కుల గురించి కాకుండా వారిలో వస్తున్న మార్పుల గురించి ఆలోచించాలని సూచించారు. అప్పుడే ప్రతి ఇంటి నుంచి దేశం గర్వపడే ఓ పౌరుడు తయారవుతాడని లక్ష్మీనారాయణ వెల్లడించారు.
ఇదీ చూడండి: TIRUMALA: ఆన్లైన్లో శ్రీవారి సర్వదర్శనం టికెట్లు.. అరగంటలోపే ఖాళీ