విజయవాడ రాజ్‌భవన్‌లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను.. భాజపా ప్రతినిధుల బృందం కలిసింది. కొవిడ్ నిబంధనల పేరిట.. చవితి నిర్వహణను ప్రభుత్వం అడ్డుకుంటోందని ఫిర్యాదు చేసింది. గవర్నర్ బిశ్వభూషణ్‌కు భాజపా ప్రతినిధులు, వీహెచ్‌పీ నేతలు వినతిపత్రం సమర్పించారు. నిరసన తెలిపినవారిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఫిర్యాదు చేశారు. పందిళ్లు వేసుకుని ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలని విజ్ఞప్తి చేశారు.
అనంతరం మీడియాతో భాజపా నేతలు మాట్లాడారు.. వైకాపా అధికారంలోకి వచ్చాక హిందువులపై దాడులు పెరిగాయని భాజపా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. 150పైగా ఇటువంటి ఘటనలు జరిగినా అరెస్టులు లేవని మండిపడ్డారు. చవితిని ఇంట్లోనే జరుపుకోవాలన్న ప్రభుత్వ జీవోను ఖండిస్తున్నామన్నారు. సినిమా హాళ్లు, స్కూళ్లు, బార్లకు లేని కొవిడ్ నిబంధనలు.. ఉత్సవాలకేంటని నిలదీశారు. వినాయక చవితికి ప్రభుత్వం అనుమతి ఇవ్వకున్నా పండగ జరిపి తీరతామని స్పష్టం చేశారు.
గుంటూరులో నగరపాలకసంస్థ చెత్త బండిలో వినాయక విగ్రహాలను మున్సిపల్ అధికారులు తరలించాడాన్ని భాజపా నేతలు ఖండించారు. ఈ తరహా చర్యలు ప్రభుత్వానికి తలవంపులు తీసుకువస్తాయన్నారు. హిందువులకు ముఖ్యమైన పండగని..రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి హైందవ సమాజం పట్ల అవమానకరంగా వ్యవహరిస్తున్నారని విశ్వహిందు పరిషత్ నేతలు అన్నారు.
ఇదీ చదవండి: Vinayaka Chavithi controversy: చవితి వేడుకలపై ప్రభుత్వం ఆంక్షలు.. తగ్గేదేలేదంటున్న విపక్షాలు!