బీహార్ రాష్ట్రంలోని పుర్ణియాజిలా జిల్లా లక్ష్మీపూర్ సంగ్రహ గ్రామానికి చెందిన చెందిన రాంలాల్ ముర్ము కొద్ది రోజుల క్రితం ప్యాకింగ్ కూలి పనుల కోసం తమిళనాడు వచ్చి తప్పిపోయాడు. పొరపాటున వేరే రైలెక్కి మధ్యలో దిగిపోయిన ఆయన... తన ఊరికి వెళ్ళేందుకు కాలినడకన ప్రయాణమయ్యాడు. కొద్ది రోజుల నుంచి ఇలా నడచుకుంటూ దివిసీమకు చేరాడు. కృష్ణా జిల్లా అవనిగడ్డ మండల పరిధిలోని వేకనూరు బస్ షెల్టర్‌కు చేరుకుని అక్కడే ఉంటున్నాడు. అతన్ని గమనించిన గ్రామానికి చెందిన ఆరిగ రాజేశ్వరరావు (ధన) వివరాలు అడిగి తెలుసుకున్నారు.
కుటుంబసభ్యులకు అప్పగింత
గత ఐదు రోజుల నుంచి అతనికి టిఫిన్, భోజనం రాజేశ్వరరావు పెట్టారు. ముర్ము చెప్పిన అడ్రస్ ద్వారా కొంతమంది గ్రామస్థులతో కలిసి అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఈ విషయం తెలుసుకున్న ముర్ము రెండో కుమారుడు రాజ్ కుమార్ ముర్ము, ఆయన బావ మంగళవారం వేకనూరుకు వచ్చి ముర్ముని కలుసుకుని ఉప్పొంగి పోయారు. రాజేశ్వరరావు వీరందరికీ భోజనం పెట్టిన తర్వాత స్థానిక పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్లి ఎస్ఐ సందీప్ ద్వారా బంధువులకు అప్పగించారు. వారి ప్రయాణ ఖర్చులు నిమిత్తం గ్రామానికి చెందిన దోవారి వెంకటేశ్వరరావు రూ.900 ఆర్థిక సహాయం చేశారు. బస్టాండ్‌లో అనాథగా ఉన్న వ్యక్తిని చేరదీసి..బంధువుల దగ్గరకు చేర్చిన రాజేశ్వరరావుని ఎస్ఐ అభినందించారు.
ఇవీ చదవండి...సరస్వతమ్మను చేరాలంటే.. గంగమ్మను దాటాలి