ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ దేశవ్యాప్తంగా నిరసనల పిలుపులో భాగంగా విజయవాడ మధ్య నియోజకవర్గం సింగ్ నగర్, ప్రకాష్ నగర్ ఆరోగ్య కేంద్రం వద్ద ఆశా వర్కర్లు నిరసన కార్యక్రమం చెేపట్టారు. కొవిడ్ ప్రబలుతున్న నేపథ్యంలో ప్రాణాలు సైతం లెక్కచేయకుండా కరోనా డ్యూటీలు చేస్తున్నా తమను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిన్నచూపు చూస్తున్నాయని ఆశా వర్కర్లు అన్నారు. ఆశా వర్కర్ల సమస్యలను ఏ మాత్రం పట్టించుకోకపోవటం బాధకరమని ఆశా వర్కర్స్ సంఘం రాష్ట్ర నాయకురాలు ధనలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రమాదకర పరిస్థితుల్లో డ్యూటీ చేస్తున్న ఆశా వర్కర్లను ప్రోత్సహించాల్సింది పోయి నెలల తరబడి జీతాలు పెండింగ్‌లో ఉంచడం సిగ్గు చేటన్నారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పెండింగ్‌లో ఉన్న జీతాలు వెంటనే ఇవ్వాలన్నారు. ఆశా వర్కర్లకు కొవిడ్ రక్షణ పరికరాలు అందించాలన్నారు. డ్యూటీలో మరణించిన వర్కర్లకు 50 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
కొవిడ్ డ్యూటీ ప్రత్యేక అలవెన్స్‌గా 10వేలు ఇవ్వాలి
ఆశా కార్యకర్తలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పెనుగంచిప్రోలు మండల ఆశా కార్యకర్తలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ఆందోళన చేపట్టారు. కోవిడ్ సమయంలో సేవలు అందిస్తున్న తమకు రక్షణ పరికరాలు అందజేయాలని కోరారు. తమతో పాటు తమ కుటుంబ సభ్యులకు కొవిడ్ పరీక్షలు నిర్వహించి ఫలితాలు వచ్చేంతవరకూ డ్యూటీలు వేయవద్దని కోరారు. కొవిడ్ డ్యూటీ ప్రత్యేక అలవెన్స్ గా పదివేల రూపాయలు అందజేయాలని డిమాండ్ చేశారు. ఏఎన్ఎం శిక్షణ పొందిన ఆశా వాలంటీర్లను రెండవ ఏఎన్ఎంగా నియమించాలని కోరారు. బకాయిలు పడిన వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి