రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ సన్నద్ధమవుతోంది. ప్రభుత్వ అనుమతి కోసం వేచి చూస్తోంది. మార్చిలోనే కొత్త నోటిఫికేషన్ల విడుదలకు సిద్ధమైన పబ్లిక్ సర్వీస్ కమిషన్.... లాక్డౌన్ నేపథ్యంలో ఆగిపోయింది. ఫలితంగా కొత్తగా నోటిఫికేషన్లు ప్రకటన సహా అప్పటికే చేపట్టిన భర్తీ ప్రక్రియను వాయిదా వేసింది. కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టడటం వల్ల పోస్టుల భర్తీకి తిరిగి చర్యలు తీసుకుంటోంది.
ఈ క్రమంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసే ప్రక్రియపై కరసత్తు చేస్తోంది. కొత్త ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వ అనుమతి తప్పనిసరి కావడం వల్ల ముఖ్యమంత్రి జగన్‌తో ఏపీపీఎస్సీ కార్యదర్శి పీఎస్ఆర్ ఆంజనేయులు సమావేశమయ్యారు. ఉద్యోగాల భర్తీకి సంబంధించిన అంశంపై సీఎంతో చర్చించినట్లు సమాచారం. ఏటా ఉద్యోగాల నియామకాల క్యాలెండర్‌ను ప్రకటించి అమలు చేస్తామని జగన్ ఇప్పటికే ప్రకటించారు. మరో నెలలో ఏడాది పూర్తి కానుండటం వల్ల హామీ నెరవేర్చే అంశంపై చర్చించినట్లు తెలిసింది.
లాక్డౌన్ సహా కరోనా వ్యాప్తితో కార్యకలాపాలు స్తంబించడం వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారింది. ఈ పరిస్థితుల్లో ఉద్యోగాల నియామకాలు చేపట్టే అంశంపై తీసుకోవాల్సిన చర్యలపై ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపై చర్చించినట్లు తెలిసింది. ఖాళీగా ఉన్న పోస్టులు, భర్తీ చేస్తే ఖజానాపై పడే భారం సహా ఇతరత్రా అంశాలపై చర్చించినట్లు సమాచారం. ఏపీపీఎస్సీ కార్యదర్శిగా ఉన్న ఆంజనేయులు.. ఏసీబీ డీజీ, రవాణా శాఖ కమిషనర్‌గానూ ఉన్నారు. అవినీతి నిరోధక శాఖ, రవాణాశాఖకు సంబంధించిన పలు కీలక అంశాలపైనా సమావేశంలో చర్చ జరిగింది.
ఇదీ చదవండి
ఉద్యోగాల పేరుతో మోసం.. ముగ్గురు సీఐఎస్ఎఫ్ కానిస్టేబుళ్లు అరెస్ట్