నవ్యాంధ్ర రాజధాని అమరావతిలోనే ఉండాలని, ఆ మేరకు అసెంబ్లీ ఆమోదం లభించిందని ఏపీసీసీ ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి విజయవాడలోని మీడియా సమావేశం ద్వారా అన్నారు. 1937లో శ్రీబాగ్ ఒడంబడికలో జరిగిన ఒప్పందం మేరకు రాయలసీమలో, విశాఖలో హైకోర్టు బెంచ్‌లు ఏర్పాటు చేసి అధికార వికేంద్రీకరణకు ముఖ్యమంత్రి కృషి చేయాలనీ సూచించారు. ఇప్పటికే రాజధాని అమరావతిలోని చాలావరకు భవనాలు 80 శాతం పూర్తయ్యాయని, అవి తాత్కాలికమో, శాశ్వతమో ఏమైనా కావచ్చు..కాని నిర్మాణాలు జరిగాయన్నది వాస్తవమన్నారు. ఇప్పుడు ఆ భవనాల్లోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూర్చుని పరిపాలన చేస్తున్నారని.. నిర్మాణాలు జరుగుతున్న భవనాలు రాజధానికి సరిపోతాయి కాబట్టి ప్రభుత్వం కాస్త వెచ్చిస్తే మిగతావి పూర్తవుతాయన్నారు. ఇటువంటి సందర్భంలో వేరే ఆలోచన అవసరం లేదని ఇప్పుడు ఉన్న చోటే రాజధానిని పూర్తి చేయాలన్నారు. రాష్ట్ర ఆదాయం ఇప్పటికే మందగించిందని.. ఇప్పటికైనా ముఖ్యమంత్రి జగన్ స్పష్టమైన ప్రకటన చేసి రాష్ట్రాభివృద్ధికి కృషి చేయాలన్నారు.
ఇదీ చూడండి:సీఆర్డీఏపై సీఎం సమీక్ష... కొనసాగుతున్న ఉత్కంఠ..!