రాష్ట్రంలో ఉద్యోగులు సమ్మెకు వెళ్లకుండా నిరోధించేందుకు 'ఎస్మా' ఉపయోగించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. దీనిపై సాధారణ పరిపాలన శాఖ కసరత్తు చేస్తోంది. అత్యవసర సేవల నిర్వహణ చట్టం (ఎస్మా) - 1971 ప్రకారం సమ్మెను నిలువరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
వైద్యులు, నర్సులు, పారా మెడికల్ సిబ్బంది, శానిటేషన్, ప్రజా రవాణా, విద్యుత్, నీటి సరఫరా, అంబులెన్స్ సర్వీసుల లాంటి పౌరసేవలకు విఘాతం కలగకుండా ఎస్మా చట్టం అమల్లోకి తేవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఉద్యోగుల కార్యాచరణను అనుసరించి నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంది. దీనిపై సీఎంవోలో ఉన్నతాధికారులు, మంత్రులతో సీఎం జగన్ సమాలోచనలు జరిపారు. సీఎంతో సమావేశం అనంతరం సచివాలయంలో కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లతో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉద్యోగులు సమ్మెకు వెళితే చేపట్టాల్సిన ప్రత్యామ్నాయాలపై సీఎస్ సమీక్షించారు.
సీఎస్ భేటీ అనంతరం మంత్రుల కమిటీ ఉద్యోగ సంఘాలను చర్చలకు ఆహ్వానించింది. ఈ భేటీలో హెచ్ఆర్ఏ, వేతన రికవరీ వంటి అంశాలపై కమిటీ చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
వెనక్కి తగ్గేదేలేదు..
Askar Rao: ప్రభుత్వం ఎస్మా ప్రయోగించినా తాము వెనుకాడేది లేదని పీఆర్సీ సాధన సమితి స్పష్టం చేసింది. మానవత దృక్పథంతో ప్రజలకు అత్యవసర సేవలకు అంతారయం కలగకుండా చూస్తామని ఉద్యోగ సంఘాల నేతలు స్పష్టం చేశారు. రేపటినుంచి పెన్ డౌన్, ప్రభుత్వ మొబైల్ డౌన్ చేపడతామని తెలిపారు. ప్రభుత్వం వినియోగించే అన్ని మొబైల్ అప్లికేషన్లను అన్ ఇన్ స్టాల్ చేయాలని పీఆర్సీ సాధన సమితి నేత ఆస్కార్ రావు పేర్కొన్నారు.
ఇదీ చదవండి
Sajjala Comments: వారిని రోజూ చర్చలకు ఆహ్వానించాల్సిన అవసరం లేదు: సజ్జల