50 ఏళ్ల వయసు పైబడిన తరువాత పొలం పనులకు కదిలిందామె. డ్రాగన్ ఫ్రూట్‌ని పండిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. సేంద్రియ విధానంలో పంటలు పండించడమే కాకుండా అధిక దిగుబడులు సాధిస్తున్నారు అన్నె పద్మావతి. కృష్ణా జిల్లా ముసునూరు మండలం రమణక్కపేటలో వియత్నాం నుంచి మొక్కలను తెప్పించుకుని గత ఏడాది డ్రాగన్ పంట సాగు మొదలు పెట్టారు. ప్రయోగాత్మక పంటే అయినా దిగుబడి ఆశాజనకంగా ఉండటంతో ఈ ఏడాది మరిన్ని జాగ్రత్తలు తీసుకుని పంట సాగు చేశారు. గతంలో ఇజ్రాయిల్ వెళ్లినప్పుడు అక్కడి రైతులు ఈ పంట పండించే విధానం... ఉపయోగించే పరికరాలు.. పండిన పంటను నిల్వ చేసే పద్ధతి... మార్కెటింగ్ వంటి విషయాలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. వాటి సారాంశాన్ని తన సేద్య పద్ధతుల్లో అనుసరిస్తున్నారు.
పాతికేళ్లపాటు ఫలాలు..
ఎనిమిది ఎకరాల పొలంలో డ్రాగన్ పండ్ల మొక్కలు సాగు చేస్తున్నారు పద్మావతి. ఎకరానికి ఆరు లక్షల రూపాయల వంతున ఒకేసారి పెట్టుబడి పెట్టారు. ఒకసారి నాటితే పాతికేళ్ల పాటు కాపు వస్తుంది. ఎడారి మొక్క కావడంతో నీరు ఎక్కువగా అందించాల్సిన అవసరం లేదు. పొలంలో భారీ వర్షాలకు నీరు ఎక్కువగా నిలిచినా తట్టుకుని నిలబడుతుంది. డ్రాగన్ మొక్కల మధ్య జామ, సీతాఫలం, పైనాపిల్, బొప్పాయి, శ్రీగంధం, బొబ్బర్లు, ఆకు కూరలను అంతర పంటలుగా సాగు చేస్తున్నారు.
పూర్తిగా ప్రకృతి సేద్యం
ఎరువులు, పురుగుల మందుల అవసరం లేకుండానే సహజంగానే డ్రాగన్ పండు పంట పండిస్తున్నారు ఈ మహిళా రైతు. జీవామృతం, పంచగవ్య తదితర గో ఆధారిత కషాయాలను ఈ పంట దిగుబడుల కోసం వినియోగిస్తున్నారు. డ్రాగన్ మొక్కలకు నత్రజని కావాల్సి ఉన్నందున.. ప్రతి మొక్క దగ్గర నవ ధాన్యాల మొక్కలు నాటారు. దీనివల్ల డ్రాగన్ మొక్కకు కావాల్సిన నత్రజని సహజసిద్ధంగా ఆ మొక్కల నుంచే అందుతోంది. ప్రకృతి ఆధారిత వ్యవసాయ పద్ధతులను నూటికి నూరు శాతం అనుసరిస్తున్నారు.
తన వంతు సహకారం...
పండ్ల తోటల పెంపకం, అంతర పంటల సాగులో అనుసరిస్తోన్న విధానాలను ఇతరులకు పద్మావతి వివరిస్తున్నారు. సేద్యంపై ఆసక్తి ఉన్నా... వివిధ కారణాలతో వ్యవసాయం చేయలేకపోతున్న వారి పంట భూములను అభివృద్ధి చేయటంలో పద్మావతి తనవంతు సహకారం అందిస్తున్నారు. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సుమారు 500 ఎకరాల భూములను అభివృద్ధి చేస్తున్నారు. మరోవైపు పద్మావతి... అన్నె ఆర్గానిక్స్ పేరిట రైతు ఉత్పత్తిదారుల సంఘాన్ని నెలకొల్పారు. ప్రకృతి సేద్యం పద్ధతిలో పంటలను పండిస్తుండటంతో... ఉత్పత్తులను కొంచెం ఎక్కువ ధరకే వినియోగదారులు కొనుగోలు చేస్తున్నారు..