ప్రభుత్వ విప్, కృష్ణా జిల్లా జగ్గయ్యపేట వైకాపా ఎమ్మెల్యే సామినేని ఉదయభానుపై ఉన్న పది కేసులను ఎత్తివేయడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది . విజయవాడలోని ఎంపీ, ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసుల విచారణ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక కోర్టులోని పది కేసుల ఉపసంహరణ నిమిత్తం హోంశాఖ ముఖ్య కార్యదర్శి ఈ ఏడాది మే 28న జారీ చేసిన జీవో 502ను రద్దు చేయాలని కోరుతూ కృష్ణాజిల్లా వత్సవాయి మండలం తాళ్లూరు గ్రామానికి చెందిన బొల్ల రామకృష్ణ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. రాష్ట్ర హోంశాఖ ముఖ్యకార్యదర్శి , డీజీపీ, ఎమ్మెల్యే సామినేని ఉదయభానును వ్యాజ్యంలో ప్రతివాదులుగా పేర్కొన్నారు.
'2019 సాధారణ ఎన్నికలకు పూర్వం ఉదయభానుపై 11 క్రిమినల్ కేసులున్నాయి. నందిగామ ఠాణాలో ముఖ్యమంత్రిపై 2017 లో నమోదైన ఓ క్రిమినల్ కేసులో ఉదయభాను సహ నిందితుడిగా ఉన్నారు. ఆ కేసు విజయవాడలోని ప్రత్యేక కోర్టులో ఉండగా... పునర్ దర్యాప్తు ముసుగులో పోలీసులు 2019 జులై 15 న మరొక తుది నివేదిక దాఖలు చేశారు. 'మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్' అని పేర్కొన్నారు. దీంతో ఆ కేసును ప్రత్యేక కోర్టు 2019 ఆగస్టులో మూసేసింది. నందిగామ, జగ్గయ్యపేట, వత్సవాయి, చిల్లకల్లు రాణాల్లో నమోదైన పది కేసులు ప్రస్తుతం ప్రత్యేక కోర్టులో పెండింగ్ లో ఉన్నాయి, ఎలాంటి సహేతకమైన కారణం లేకుండా.. న్యాయ సమర్థనీయ పరిశీలన చేయకుండా 2021 మార్చి 23న రాష్ట్ర డీజీపీ ఇచ్చిన సిఫారసు లేఖ మేరకు హోంశాఖ ముఖ్యకార్యదర్శి కేసుల ఉపసంహరణ నిమిత్తం జీవో జారీ చేశారు. ప్రాసిక్యూషన్ ఉపసంహరించే అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వం వివేచన , అత్యంత జాగ్రత్తగా వినియోగించాలి . కాని ప్రస్తుత ప్రభుత్వం.. రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా పక్షపాత ధోరణితో నేతలపై క్రిమినల్ కేసుల ఎత్తివేతకు అధికారాన్ని వినియోగిస్తోంది. లోతైన దర్యాప్తు అనంతరమే.. ఆ పది కేసుల్లో పోలీసులు అభియోగపత్రాలు దాఖలు చేశారు. ఈ దశలో ఉపసంహరణ సరికాదు. ఈ క్రిమినల్ కేసుల్లో విచారణ జరగాలి. ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకొని ఉదయభానుపై కేసుల ఉపసంహరణ కోసం జారీచేసిన జీవోను రద్దుచేయండి . ఆ జీవో అమలును నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులివ్వండి' అని కోరారు.
ఇదీ చదవండి