Murder Mystery In Ambajipeta : తెలంగాణ రాష్ట్రంలో నమోదైన మిస్సింగ్ కేస్ మిస్టరీ అంబాజీపేట మండలం గంగలకుర్రు అగ్రహారంలో వీడింది. తమ వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడనే నెపంతో భార్య, ఆమె ప్రియుడు కలిసి భర్తను హత్య చేసిన ఉదంతమిది. పోలీసులు ఈ కేసు వివరాలు వెల్లడించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం గంగలకుర్రు అగ్రహారానికి చెందిన రాయుడు రవిశంకర్ తల్లి ఉపాధ్యాయురాలుగా తెలంగాణలోని ఆదిలాబాదులో పనిచేసే వారు. ఆమెతో పాటు ఉంటున్న రవిశంకర్ వద్ద ఆదిలాబాద్‌కు చెందిన బూల్కర్ గజానంద్ (36) 2016 నుంచి కార్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు.
తొలుత మసాలా వ్యాపారం నిర్వహించిన రవిశంకర్ వ్యాపారం లాభసాటిగా లేకపోవడంతో అమ్మమ్మ గారి స్వగ్రామం గంగలకుర్రు అగ్రహారం రాచపాలెంలోని వ్యవసాయ క్షేత్రంలో రేకుల షెడ్డు నిర్మించి వర్మి కంపోస్ట్ ఎరువుల తయారీ కేంద్రాన్ని ప్రారంభించాడు. వర్మి కంపోస్టు ఎరువుల కేంద్రం కూడా ఆర్థికంగా కలిసి రాకపోవడంతో రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిల్ విడి భాగాల వ్యాపారాన్ని చేపట్టాడు. తనకు ఎంతో కాలంగా పరిచయం ఉన్న ఆదిలాబాద్‌కు చెందిన గజానంద్‌ను, అతని భార్య ఊర్మిళను తన వద్ద పనిచేసేందుకు రవిశంకర్ తీసుకువచ్చాడు.
అమలాపురం రూరల్ మండలం బండారులంక మెట్ల కాలనీలో వారు నివాసం ఉండేందుకు రవి శంకర్ ఏర్పాటు చేశాడు. ఈ సమయంలో రవిశంకర్, ఊర్మిళకు మధ్య వివాహేతర సంబంధం ఏర్పడడంతో గజానంద్‌ను అడ్డు తొలగించుకునేందుకు పథకం పన్నారు. వర్మీ కంపోస్ట్ ఎరువుల కేంద్రం నెలకొల్పిన రేకుల షెడ్డులో గత ఏడాది నవంబరు 23న గజానంద్‌ను తీవ్రంగా గాయపరిచి హతమార్చారు. రేకుల షెడ్డు సమీపంలోనే గొయ్యి తీసి మృతదేహాన్ని పూడ్చిపెట్టారు.
2023 జనవరిలో ఊర్మిళ మరో వ్యక్తితో ఉండడాన్ని గమనించిన గజానంద్ బంధువులు ఊర్మిళను ఆరా తీయగా హైదరాబాదు నుంచి పారిపోయాడని చెప్పిందని తెలిపారు. అంబాజీపేట మండలం గంగలకుర్రు అగ్రహారంలో కొడుకు, కోడలు ఉండగా, కోడలు మరో వ్యక్తితో ఆదిలాబాదులో కనిపించడంతో అనుమానించిన గజానంద్ తండ్రి శివాజీ హైదరాబాద్‌లోని అఫ్జల్ గంజ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. మిస్టరీ కేసుగా నమోదు చేసిన అక్కడ పోలీసులు విచారణ చేపట్టారు. రవిశంకర్, ఊర్మిళలు కలిసి గజానంద్‌ను హత్య చేసినట్లు విచారణలో కనుగొన్నారు.
అఫ్జల్ గంజ్ పోలీసులు అంబాజీపేట స్టేషన్‌కు కేసును బదిలీ చేశారు. రవిశంకర్, ఊర్మిళలను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. గంగలకుర్రు అగ్రహారం రాచపాలెంలోని రేకుల షెడ్డు సమీపంలో పూడ్చిపెట్టామని తెలపడంతో, ప్రదేశాన్ని గుర్తించి మృతదేహాన్ని వెలికి తీశారు. ఏరియా ఆసుపత్రి వైద్యులు నాగేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో శవ పంచనామా చేశారు. నాలుగు రోజుల్లో మిస్టరీ కేసును ఛేదించారు. మృతుడి భార్య ఊర్మిలతో పాటు ప్రియుడు రవిశంకర్‌ను అరెస్ట్ చేశామన్నారు. కాగా ఈ కేసును అత్యంత చాకచక్యంగా నాలుగు రోజుల్లో ఛేదించిన సీఐ ప్రశాంతకుమార్, ఎస్పై చైతన్యకుమార్, క్లైం పార్టీ సిబ్బందిని కోనసీమ జిల్లా ఎస్పీ శ్రీధర్ అభినందించారు.
ఇవీ చదవండి