Amalapuram woman murder: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలోని ఏఎంజీ కాలనీలో మంగళవారం జరిగిన మహిళ హత్య కేసు మరో మలుపు తిరిగింది. మహిళ హత్య, మరో మహిళపై హత్యాయత్నం కేసును పోలీసులు ఛేదించారు. గత కొంతకాలంగా స్నాప్‌చాట్‌లో పరిచయమైన మహిళను అంతమొందించాలని లక్ష్యంతో.. నిందితుడు మరో మహిళను హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.
అమలాపురం ఎంజి కాలనీలో వెంకటరమణ అనే మహిళ ఇంట్లో అదే కాలనీకి చెందిన శ్రీదేవి 15 సంవత్సరాలుగా పని చేస్తోంది. ఎప్పటిలాగే నిన్న వెంకటరమణ ఇంటికి శ్రీదేవి పనికి వెళ్లింది. డాబాపైన వెంకటరమణతో కలిసి ఉండగా.. హఠాత్తుగా నెల్లూరు జిల్లాకు చెందిన కోట హరికృష్ణ వచ్చి శ్రీదేవిని చాకుతో హతమార్చాడు. అడ్డుకోబోయిన యజమానురాలు వెంకటరమణపై హత్యాయత్నం చేశాడు. ఈ ఘటనలో పోలీసులు నింధితుడిని అదుపులోకి తీసుకున్నారు. హరికృష్ణ, శ్రీదేవిని ఎందుకు హత్య చేశాడనే అంశంపై దర్యాప్తు చేపట్టారు.
వెంకటరమణకు నాగదుర్గ అనే కుమార్తె ఉంది. నాగదుర్గ ఐదు నెలల క్రితం స్నాప్ చాట్ ద్వారా నెల్లూరుకు చెందిన హరికృష్ణతో పరిచయం ఏర్పడింది. అప్పటినుంచి వీరిద్దరూ తరచూ ఫోన్లో మాట్లాడుకుంటున్నారు. కొద్ది రోజుల అనంతరం వివాహిత అయిన నాగ దుర్గను.. ప్రేమిస్తున్నానని హరికృష్ణ ఫోన్లో వేధించడం మొదలుపెట్టాడు. హరికృష్ణ ప్రవర్తనను గమనించిన నాగదుర్గ ఫోన్లో మాట్లాడటం, స్నాప్‌చాట్ చేయటం తగ్గించింది. నాగదుర్గ తనను దూరంపెట్టడంతో హరికృష్ణ ఆమెపై కక్ష పెంచుకున్నాడు. గతంలో హరికృష్ణకు నాగదుర్గ అమలాపురంలోని తాము ఉండే ఇంటి అడ్రస్‌ను చెప్పింది. నాగదుర్గ హరికృష్ణకు దూరంగా ఉండాలని ఉద్దేశంతో ఫోన్లు మాట్లాడటం చాట్ చేయడం తగ్గించింది.
దీంతో హరికృష్ణ కక్ష కట్టి ఆమెను హతమార్చేందుకు.. మంగళవారం సాయంత్రం అమలాపురంలోని ఆమె ఇంటికి వచ్చాడు. డాబాపైన వెంకటరమణ పక్కనే ఉన్న పనిమనిషి శ్రీదేవి యజమానురాలు కుమార్తె నాగ దుర్గ అనుకున్నాడు. తనతో పాటు తెచ్చుకున్న చాకుతో శ్రీదేవిని పొడిచి హతమార్చాడు. అడ్డుకోబోయిన వెంకటరమణపై సైతం దాడి చేశాడు. ఈ దాడిలో శ్రీదేవి ఘటన ప్రదేశంలో మృతి చెందగా వెంకటరమణ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
సరదా కోసం ఒక మహిళ చాట్ చేస్తే మరో మహిళ ప్రాణాలు పోవడంతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఒకరు చేసిన తప్పునకు మరొకరు బలైపోయారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హత్యకు గురైన శ్రీదేవికి భర్త, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. శ్రీదేవి మరణంతో ఆ కుటుంబం పరిస్థితి అయోమయంగా మారింది. యజమానురాలు వెంకటరమణ అమలాపురం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఆమె కోలుకుటున్నట్లు వైద్యులు తెలిపారు.
ఇవీ చదవండి: