Samagra Siksha Abhiyaan Employees Strike: రెగ్యులైజేషన్, వేతనాల పెంపు, తక్షణమే బకాయిల చెల్లింపు తదితర సమస్యల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహించటంతో సమగ్ర శిక్ష అభియాన్ కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు ఈరోజు దీక్షకు దిగారు. అనకాపల్లి, ముమ్మిడివరం, నెల్లూరు, విజయనగరం, ఓంగోల్లో ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. ఈ ధర్నాకు సీఐటీయూ నాయకులు మద్దతు తెలిపారు. న్యాయమైన తమ డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించే వరకూ సమ్మె విరమించబోమని సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగులు స్పష్టం చేశారు.
సీఎం జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీలు మరిచి సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగులను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగన్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ సమగ్ర శిక్షా కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు ఆందోళనలు చేపట్టారు. సమగ్ర శిక్షా అభియాన్లో పనిచేస్తున్న అన్ని విభాగాల ఉద్యోగులను రెగ్యులర్ చేసి, సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం కల్పించాలి. యం.టీ.యస్ అమలు చేసి వేతనాలు పెంచాలి. ఉద్యోగ భద్రత కల్పించి ప్రతి నెలా 1వ తేదీకి వేతనాలు చెల్లించి, వార్షిక బడ్జెట్ ఒకేసారి విడుదల చేయాలి. వేతనంతో కూడిన మెడికల్ లీవులు మంజూరు చేయాలని, గ్రాడ్యుటీ మరియు 20లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్స్ తక్షణమే అమలు చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.
"సమాన పనికి సమాన వేతనం, పీఎఫ్, ఈఎస్ఐ, రిటైర్మెంట్ వయస్సు 62 ఏళ్లకు పెంచాలి. ఈ సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకుండా మాచేత వెట్టిచాకిరి చేయించుకుంటోంది. ఇందుకు నిరసనగా మేము సమ్మె చేస్తున్నాము. గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలి". -సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగి
Samagra Siksha Abhiyaan Employees Protest in Konaseema: కోనసీమ జిల్లా ముమ్మిడివరం విద్యాశాఖ అధికారి కార్యాలయం ఎదుట సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగులు నిరసనలు తెలిపారు. సమగ్ర శిక్షా అభియాన్లో పనిచేస్తున్న అన్ని విభాగాల ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్, పార్ట్ టైం ఉద్యోగుల రెగ్యులర్ సమాన పనికి సమాన వేతనం ఉద్యోగ భద్రత కోసం సమ్మె నిరసన జయపద్రం చేయాలని ఉద్యోగులు పిలుపునిచ్చారు.
Samagra Siksha Abhiyaan Employees Protest in Satyasai District: శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి గణేష్ సర్కిల్ నుంచి రెవెన్యూ కార్యాలయం వరకు సమగ్ర శిక్షా కాంట్రాక్టు ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. ఈ ధర్నాకు సీఐటీయూ నాయకులు మద్దతు తెలిపారు. న్యాయమైన తమ డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించేంత వరకూ సమ్మె విరమించబోమని స్పష్టం చేశారు.
నెల్లూరు డిఇఓ కార్యాలయం ఎదుట వివిధ విభాగాల్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది నిరసన చేపట్టారు. పాదయాత్ర సమయంలో తమను ఆదుకుంటామని, సమాన పనికి సమాన వేతనం అందిస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్ ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదని సమగ్ర శిక్షా అభియాన్ కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ నాయకులు విమర్శించారు. తమకు ఇచ్చే వేతనాలు కూడా సక్రమంగా ఇవ్వడం లేదని వాపోయారు. ప్రభుత్వం స్పందించి తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగిస్తామని ఉద్యోగులు హెచ్చరించారు.