Lanka Villages Submerged in Floods: గోదావరి ఉద్ధృతి తగ్గినా.. కోనసీమ లంకలను వరద వీడటం లేదు. లోతట్టు ప్రాంతాలన్నీ ముంపులోనే మగ్గుతున్నాయి. రోడ్లపై నీటి ప్రవాహంతో ప్రజలకు పడవలపై రాకపోకలు తప్పడం లేదు. తిండీతిప్పలు లేక బాధితులు అల్లాడుతున్నారు. అధికారులు కేవలం నీళ్ల డబ్బాలతోనే సరిపెట్టేశారని మండిపడుతున్నారు. మరోవైపు పంటలు నీటిలో నానుతూ కుళ్లిపోతున్నాయి.
ఉగ్రరూపంతో తీరప్రాంతాలపై విరుచుకుపడ్డ గోదారమ్మ క్రమంగా శాంతిస్తోంది. ధవళేశ్వరం కాటన్ ఆనకట్ట వద్ద వరద ప్రవాహం 10 లక్షల క్యూసెక్కుల లోపు రావడంతో మొదటి ప్రమాద హెచ్చరిక ఉపసంహరించారు. అయినా కోనసీమ లంకలను వరద కష్టాలు వెంటాడుతున్నాయి. లోతట్టుప్రాంతాలు ముంపులోనే ఉన్నాయి. ఎదురుబీడెం కాజ్ వే పై వరద ఉద్ధృతి కాస్త తగ్గినా అయినివిల్లిలంక, వీరవల్లిపాలెం, తొత్తరమూడి, అద్దంకివారిలంక వాసులు పడవల్లోనే రాకపోకలు సాగిస్తున్నారు. బి.దొడ్డవరం, పెదపట్నం లంకల్ని వరద ఇంకా వీడలేదు. అప్పనరామునిలంక పూర్తి జలదిగ్బంధంలో ఉంది.
మలికిపురం మండలంలోని రామరాజులంక బాడవ నాలుగు రోజులుగా వరద నీటిలో నానుతోంది. 250 మంది నివాసం ఉండే ఈ లంకలో రోడ్లు పూర్తిగా ముంపులోనే ఉన్నాయి. రాకపోకలకు ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. పడవలు వెళ్లేందుకు అవకాశం లేకపోతే, ట్రాక్టర్లన్నా ఏర్పాటు చేయలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరద వచ్చిన ప్రతిసారీ ఇవే ఇబ్బందులున్నా పాలకులకు పట్టట్లేదని మండిపడుతున్నారు. శివారు లంకల్లోని ఇళ్లలో నీరు చేరి స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిత్యావసరాలు పంపిణీ చేస్తున్నామని అధికారులు ప్రకటించినా.. వాస్తవానికి క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి లేదు. కేవలం నీళ్ల డబ్బాతో సరిపెట్టేస్తున్నారని.. భోజనం, సరకులు ఇవ్వట్లేదని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పి.గన్నవరం మండలంలోని లంకలన్నీ జలదిగ్బంధంలోనే ఉన్నాయి. రోడ్లపై నీటి ప్రవాహంతో పడవలపైనే జనం రాకపోకలు సాగిస్తున్నారు. అప్పనపల్లి బాలబాలాజీ ఆలయంలో వరుసగా నాలుగో రోజూ దర్శనాలు నిలిపేశారు. చింతావాని రేవు, చింతపల్లిలంక, కమిని, సలాదివారిపాలెంలలో పొలాలను గోదారి ముంచెత్తింది. కూరగాయలు, అరటి, బొప్పాయి పంటలు నీటిలో నాని కుళ్లిపోతున్నాయి. తీవ్రంగా నష్టపోయామని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు గోదావరి ఎర్ర నీటితో పచ్చి మేతకు తీవ్ర కొరత ఏర్పడింది. ఎండు గడ్డి కూడా తడిచిపోయింది. పశువుల దాణా కోసం రైతులకు తిప్పలు తప్పడం లేదు. ముమ్మిడివరం మండలంలోని వరద ప్రభావిత గ్రామాల్లో తెలుగుదేశం నాయకులు పర్యటించి బాధితులు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పోలవరం ముంపు గ్రామాల్లో ప్రజలు తిండి నీరు లేక ఇబ్బంది పడుతున్నా సీఎం పట్టించుకోవడంలేదని.. టీడీపీ నేత బండారు సత్యనారాయణమూర్తి మండిపడ్డారు.