Godavari flood in Lanka Villages: గడచిన వారం రోజులుగా గోదావరి వరద ప్రవాహం కారణంగా ముంపు బారిన పడిన లంక గ్రామాల ప్రజలను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు దాట్ల బుచ్చిబాబు ఆరోపించారు.. పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలంలోని ముంపు గ్రామాలైన పల్లంవారిపాలెం, గురజాపులంక, కమిలి లంక, ఆఫ్ ఠాణేల్లంక లంక ప్రాంతాల్లో పర్యటించి.. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
పరామర్శించిన టీడీపీ నాయకులు.. తెలుగుదేశం ప్రభుత్వంలో వరదలకు ముందే ప్రజలను అప్రమత్తం చేయడం.. అవసరమైన నిత్యవసరాల సరుకులు ఇవ్వడం లాంటి సౌకర్యాలు కల్పించే వారని.. జిల్లా కలెక్టర్ నుంచి మండల రెవెన్యూ అధికారులంతా ముంపు ప్రాంతాల్లోనే ఉండేవారని.. ప్రస్తుతం ఆ పరిస్థితి ఎక్కడా కనిపించలేదని వివరించారు.. కనీసం భోజనాలు, తాగునీరు సౌకర్యం ప్రభుత్వం కల్పించలేదని స్థానికులు తెలిపారు. ఎమ్మెల్యే, అధికారులు పలకరింపులకే పరిమితమయ్యారని వాపోయారు.
తడిసిన దుస్తులతో పాఠశాలలకు వెళ్తున్న విద్యార్థులు.. గోదావరి ఉద్ధృతి తగ్గినప్పటికీ కోనసీమలోని లోతట్టు ప్రాంతాలలో వరద నీరు నిలిచి ఉండటంతో.. విద్యార్థులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. వరద నీటిలో నడిచి తడిసిన దుస్తులతో పాఠశాలలకు, కళాశాలలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. పి. గన్నవరం నియోజకవర్గంలోని శివాయిలంక గ్రామంలో.. సుమారు 50 మంది విద్యార్థులు ఉన్నారు. వీరు బయటకు రావాలంటే సుమారు రెండు కిలోమీటర్లు నడిచి రావాలి.. కానీ రహదారి ఇంకా వరద ముంపులోనే ఉంది. వరద తగ్గినప్పటికీ రహదారిపై వరద నీరు ఉండటంతో.. శివాయలంక గ్రామం నుంచి ఏటిగట్టు వరకు రెండు కిలోమీటర్ల మేర రహదారిలో నడిచి వచ్చి అక్కడ నుంచి పాఠశాలలకు, కళాశాలలకు వెళ్తున్నారు.
కాజ్‌వేలు నిర్మించాలని కోరుతున్నా.. ఈ ప్రాంతంలో కాజ్‌వేలు నిర్మించాలని ఎప్పటినుంచో కోరుతున్నా.. పాలకులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గోదావరి నదికి మధ్యలో ఉన్న ఊడిమూడి లంక, అరిగెలవారి పేట, బూరుగులంక, జి పెదపూడిలంక, అయోధ్యలంక, ఆనగార్లంక, కనకాయలంక గ్రామాలకు చెందిన విద్యార్థులూ బడికి వెళ్లేందుకు.. అనేక ఇబ్బందులు పడుతున్నారు.
నిత్యావసరాల సరుకులను సరఫరా చేసిన మంత్రి.. నిత్యావస కె. గంగవరం మండలంలోని కోటిపల్లి, శేరిలంక గ్రామాలలో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పర్యటించి వరద బాధిత కుటుంబాలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇక్కడ ఎవరికి అవసరం వచ్చినా అధికారులను సంప్రదిస్తే పరిష్కారం అవుతుందని మంత్రి భరోసా ఇచ్చారు. సుమారు 800 కుటుంబాలకు ఒక్కొ కుటుంబానికి 25 కేజీల చొప్పున బియ్యం, కేజీ కందిపప్పు, కేజీ ఉల్లిపాయలు, కేజీ నూనె, కేజీ బంగాళాదుంపలను మంత్రి పంపిణీ చేశారు.