Daggubati Purandeswari Fires on YSRCP: కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతో ఏపీలో జగన్ ప్రభుత్వం తాము ఏదో ప్రజలకు మేలు చేసినట్లు గొప్పలు చెప్పుకుంటుందని భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ పాలన చేపట్టి తొమ్మిది సంవత్సరాలైన సందర్భంగా డాక్టర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లిలో జరిగిన బీజేపీ విస్తృత స్థాయి సమావేశంలో ఆమె పాల్గొన్నారు. కోనసీమలోని రైల్వే లైన్ అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం వాటాగా ఇవ్వాల్సిన నిధులను ఇవ్వకుండా కాలయాపన చేస్తుందని విమర్శించారు. ఇప్పటివరకు కేవలం రెండు కోట్ల రూపాయల నిధులు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా ఇచ్చిందని మండిపడ్డారు.
బీజేపీ మెరుగైన పాలన: రైతులకు కేంద్ర ప్రభుత్వం నిధులు వారి ఖాతాలో జమ చేస్తుంటే.. జగన్ ప్రభుత్వం మాత్రం ఇది తమ ఘనతగా చెప్పుకుంటుందన్నారు. జాతీయ రహదారులు ఎక్కడ చూసినా అభివృద్ధి చెందాయని.. ఏపీలో మాత్రం రహదారుల దుస్థితి దారుణంగా ఉందన్నారు. అన్ని వర్గాల ప్రజలకు ఏపీ ప్రభుత్వంలో అన్యాయం జరిగిందని విమర్శించారు. కేంద్రంలో బీజేపీ మెరుగైన పాలన అందిస్తుంటే.. రాష్ట్రంలో మాత్రం వైసీపీ పాలన అందుకు భిన్నంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఒక ఎంపీకే రక్షణ లేకపోతే.. సామాన్య మానవుడి పరిస్థితి ఏంటి: ఏపీలో శాంతి భద్రతల విషయంలో సాక్ష్యాత్తు ఒక ఎంపీకే రక్షణ లేకుండా పోయిందని.. ఇటీవల విశాఖపట్నంలో జరిగిన సంఘటనను వివరించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ప్రాణహాని ఉందని.. సాక్ష్యాత్తు ఆయనే ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రజాదరణ ఉన్న ఒక పార్టీ అధినేతకే రక్షణ లేకుండాపోతే ఇక సామాన్య మానవుడి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన అంశాలలో.. 98శాతం నెరవేర్చామని వైసీపీ నాయకులు గొప్పలు చెప్పుకుంటున్నారని.. కానీ అందులో ఉన్న మెగా డీఎస్సీ, ఏటా జాబ్ క్యాలెండర్, ధరల స్థిరీకరణ విషయాలను మర్చిపోయారన్నారు.
వైసీపీ నాయకులు అధికారంలోకి వచ్చిన వెంటనే దిశ యాప్ ప్రవేశపెడుతున్నామని చెప్పారు.. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంటి దగ్గరే ఆడపిల్ల జీవితం నాశమైంది. దీనిని బట్టే రాష్ట్రంలో మహిళలకు ఉన్న రక్షణ అర్థమవుతుందని ఆమె మండిపడ్డారు. అసలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అధికారంలో ఉండే హక్కు ఉందా అని ప్రశ్నించారు. ప్రజల సంక్షేమం గురించి పట్టించుకోని పార్టీ అధికారంలో ఉండాలా.. లేకుంటే ఓట్లతో సంబంధం లేకుండా కేంద్రంలో తొమ్మిది సంవత్సరాలుగా ప్రజలకు సుపరిపాలన అందిస్తున్న పార్టీ కావాలా అని ప్రశ్నించారు. అంతకుముందు అయినవిల్లి సిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో స్వామి వారికి ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు.