Annampalli Toll Plaza: ఉభయగోదావరి జిల్లాల్లో.. నిత్యం పచ్చగా కళకళలాడుతూ ఉండే ప్రాంతం కోనసీమ జిల్లా. ఈ పచ్చని ప్రకృతి అందాలను ఆస్వాదించడానికి.. ప్రతి ఒక్కరూ ఉవ్విళ్లూరుతారు. ఇతర రాష్ట్రాలలో స్థిరపడినవారు స్వగ్రామాలకు వెళ్తూ.. అదేవిధంగా పండుగలు.. వివాహాలు, ఇతర శుభకార్యాల సమయంలో.. కిలోమీటర్ల పొడవైన రహదారులపై ప్రయాణిస్తూ.. రోడ్డుకి ఇరువైపులా ఉండే ప్రకృతి అందాలను, స్వచ్ఛమైన గాలిని, పచ్చని వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు. కానీ ఇకపై ఇప్పుడు అలా ఉచితంగా ప్రకృతిని ఆస్వాదించేందుకు వీలు పడదు. ఎందుకంటే.. భారత ప్రభుత్వం నూతనంగా నిర్మించిన జాతీయ రహదారులపై ప్రతి 50 కిలోమీటర్లకు ఒక టోల్ గేట్ ఏర్పాటు చేసే విధంగా నిర్ణయం తీసుకుంది. దీంట్లో భాగంగా కోనసీమ జిల్లా ప్రాంతంలో కూడా మొదటిసారిగా టోల్ గేట్‌ను ఏర్పాటు చేశారు.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం అన్నంపల్లి వద్ద జాతీయ రహదారి 216పై వాహనాల నుంచి టోలు వసూలు చేసే కేంద్రాన్ని ప్రారంభించారు. కాకినాడ సమీపంలో ఉన్న గురజానపల్లి నుంచి పాసర్లపూడి వరకు సుమారు 61 కిలోమీటర్లు జాతీయ రహదారిని గత ఏడాది ఆగస్టులోనే కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆన్లైన్ విధానంలో ప్రారంభించారు. అయినా సరే.. ఈ మార్గంలో ఇంకా అనేకచోట్ల నిర్మాణ పనులు జరుగుతూనే ఉన్నాయి. కానీ ప్రభుత్వం వాహనదారుల నుంచి డబ్బులు వసూలు చేసేందుకు ముహూర్తం ఖరారు చేసింది. కేంద్ర ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ విధానం తీసుకురావడంతో చెల్లింపులు అన్ని ఆన్లైన్ విధానంలో జరుగుతున్నాయి. స్థానికంగా తిరిగే వాహనాలకు.. రాయితీల కోసం.. ప్రత్యేక గుర్తింపు కార్డులను అందించేందుకు చర్యలు చేపట్టారు.
జాతీయ రహదారి పూర్తి స్థాయిలో నిర్మాణం పూర్తి కాకపోయినా వాహనదారుల నుంచి డబ్బులు వసూలు చేయడమే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని.. విస్తరణ సమయంలో సరైన ప్రమాణాలు పాటించక పోవడంతో.. ప్రతిరోజు ప్రమాదాలు జరుగుతున్నాయని.. వీటిని సరి చేయకుండా టోల్ నిర్వహణ ఏర్పాట్లు చేయడం చాలా బాధాకరమని ముమ్మిడివరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ టోల్ గేట్ కారణంగా గ్రామీణ ప్రాంతాల ప్రజలు.. ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆర్టీసీ బస్సులలో ప్రయాణించేందుకు అదనపు భారం పడుతుందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముమ్మడివరం.. మురమళ్ళ మధ్య ఉన్న దూరం మూడు కిలోమీటర్లు. కాగా అటు నుంచి ఇటు.. ఇటు నుంచి అటు.. వెళ్లి వచ్చేందుకు ఆర్టీసీ బస్సు ఎక్కితే టోలు బాదుడు తప్పదని ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు.
కొద్దిరోజుల క్రితం వరకూ కాకినాడ.. అమలాపురం మధ్య 50 రూపాయలు ఉండగా.. ప్రస్తుతం టోల్ గేట్ రావడం వలన అది 65 రూపాయలకు పెరగడంతో సామాన్య ప్రజలు, కూలీలు ఇబ్బందులు పడుతున్నారు. అదే విధంగా ముమ్మడివరం.. మురమళ్ళ మధ్య.. 3 కిలోమీటర్ల దూరానికి.. టోల్ గేట్ రావడం వలన ఒక్కో టికెట్‌పై 5 రూపాయలను పెంచారని ప్రజలు చెప్తున్నారు.
"ఈ జాతీయ రహదారి ఏదైతే ఉందో.. ఇది పూర్తికా ఇంకా రూపాంతరం చెందలేదు. చాలా పనులు ఎక్కడివి అక్కడే ఉన్నాయి. ఈ రోడ్డులో కూడా రోజుకో ప్రమాదం జరుగుతోంది. రోడ్డు పూర్తిగా నిర్మాణం కాకుండానే అన్నంపల్లి టోల్ గేట్‌ను ప్రారంభించడం చాలా దురదృష్టకరం. దీనివలన వాహనదారులపై భారం పడుతుంది". - పితాని బాలకృష్ణ, జనసేన నేత
ఇవీ చదవండి: