Anganwadi Workers 31st Day Dont Stop Strike: ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీలు చేపట్టిన ఆందోళనలు 31వ రోజు కొనసాగాయి. ప్రభుత్వం తమపై ఎంత మొండిగా వ్యవహరించినా నిరసన కార్యక్రమాలు ఆపేది లేదని అంగన్వాడీలు తేల్చి చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. కోనసీమ జిల్లా ముమ్మిడివరం దీక్షా శిబిరంలో అంగన్వాడీలు చిన్నారులకు పుట్టినరోజు వేడుకలు, అన్నప్రాసన, పౌష్ఠికాహారం అందించారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకపోతే ఆందోళన మరింత తీవ్రతరం చేస్తామని విజయవాడలో అంగన్వాడీలు హెచ్చరించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో అంగన్వాడీ కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. తెనాలిలో అంగన్వాడీలు కుర్చీలు నెత్తిన పెట్టుకుని నిరసన తెలిపారు. అంగన్వాడీల సమస్యలు పరిష్కరించకుంటే అన్ని రాజకీయ పార్టీలతో కలిసి రాష్ట్ర బందుకు పిలుపునిస్తామని కర్నూలులో వామపక్ష నాయకులు హెచ్చరించారు.
Anganwadi Strike in YSR District: కడపలో అంగన్వాడీలు చప్పట్లు కొడుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వైఎస్సార్ జిల్లా బద్వేలులో అంగన్వాడీ కార్యకర్తలు మెడకు ఉరితాడు వేసుకొని నిరసన చేపట్టారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలోని దీక్షా శిబిరం వద్ద అంగన్వాడీలు అర్ధరాత్రి వేళ ఆటలాడుతూ, పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ నిరసన తెలిపారు. జగన్ చిత్రపటం ముందు దీపాలు వెలిగించి శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో అంగన్వాడీ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో అంగన్వాడీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. కనీస వేతనం మా హక్కంటూ శింగనమలలో అంగన్వాడీలు నినదించారు.
ప్రభుత్వానికి మాపై కక్ష ఎందుకు? - చర్చలకు పిలవకుంటే ఆందోళన ఉద్ధృతం: అంగన్వాడీలు
Anganwadi Strike in All Districts: ఒంగోలు కలెక్టరేట్ ఎదుట అంగన్వాడీలు నిరాహార దీక్ష నిర్వహించారు. తమ సమస్యలను పరిష్కరించాలని నినాదాలు చేశారు. ప్రభుత్వం వెంటనే జీవో నెంబర్ రెండును తక్షణమే ఉపసంహరించుకోవాలని అంగన్వాడీలు డిమాండ్ చేశారు. అంగన్వాడీలు రోడ్డెక్కి 31రోజుల నుంచి సమ్మె చేస్తుంటే ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదని అంగన్వాడీలు మండిపడ్డారు. నోటీసులు ఇస్తే భయపడేది లేదని అంగన్వాడీలు తేల్చి చెప్పారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం కనీస పనికి కనీస వేతనం 26వేల రూపాయలు ఇవ్వాలని అంగన్వాడీలు చెప్పారు. వైసీపీ నాయకులు అంగన్వాడీ సెంటర్ల తాళాలు తీయమని మమ్మల్ని బెదిరిస్తున్నారని పేర్కొన్నారు.
అంగన్వాడీల ఉద్యోగాలకు ఎసరు - విధుల్లోంచి తొలగిస్తున్నట్లు నోటీసులు
Anganwadis Indefinite Strike in Andhra Pradesh: రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు, కార్యకర్తలు మినీవర్కర్లు నిరవధిక సమ్మె నెల రోజులకు చేరింది. మూడు దఫాలుగా మంత్రులు చర్చలు జరిపినా స్పష్టమైన వైఖరిని ప్రకటించకపోవడంతో సమ్మె కొనసాగుతూ వస్తోంది. అంగన్వాడీలపై రాష్ట్ర ప్రభుత్వం ఎస్మా చట్టాన్ని ప్రకటించినా ఏ మాత్రం వెనక్కి తగ్గకపోవడంతో ప్రభుత్వం మరోసారి చర్చలు జరిపేందుకు సీఐటీయు ఆధ్వర్యంలో అంగన్‌వాడీ యూనియన్ ప్రతినిధులను ప్రభుత్వం ఆహ్వానించింది. ఈసారైనా స్పష్టమైన హామీ రాకపోతే తమ ఆందోళన మరింత తీవ్రతరం చేస్తామని యూనియన్ నాయకులు పేర్కొంటున్నారు. సంక్రాంతి పండుగను కూడా దీక్ష శిబిరాల్లోనే నిర్వహించాలని నిశ్చయించారు. భోగి సందర్భంగా అంగన్‌వాడీ, మినీ టీచర్లకు, సహయకులకు ఇచ్చే నోటీసులను భోగీ మంటల్లో వేస్తామన్నారు.
'ఎస్మా చట్టాలకు భయపడం' - సమస్యలు పరిష్కరించే వరకు వెనక్కి తగ్గెదే లేదు: అంగన్వాడీలు