Anganwadi Teachers Stopped by Police: సమస్యల పరిస్కారం కోరుతూ అసెంబ్లీ ముట్టడికి బయలుదేరి వెళుతున్న అంగన్ వాడీ టీచర్లను పోలీసులు అడ్డుకున్నారు. అమరావతికి బయలుదేరిన అంగన్వాడీ టీచర్లను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి స్టేషన్లకు తరలించారు. హక్కులను హరిస్తున్నారంటూ.. పోలీసులతో అంగన్వాడీ టీచర్లు వాగ్వాదానికి దిగారు. జగన్మోహన్ రెడ్డి సర్కారు ఏర్పాటైన నాలుగేళ్లలో అంగన్వాడీ కార్యకర్తల సమస్యలను పరిష్కరించలేదని వాపోతున్నారు. తమ సమస్యలను చెప్పుకునే అవకాశం కూడా లేకుండా చేయడంపట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అడ్డుకున్న పోలీసులు: తమ సమస్యల పరిస్కారం (Anganwadi Teachers Problems ) కోరుతూ సోమవారం తలపెట్టిన చలో అసెంబ్లీ ముట్టడికి బయలుదేరి వెళుతున్న అంగన్వాడీ టీచర్లను రామచంద్రాపురం బైపాస్ రోడ్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రెండు బస్సుల్లో అమరావతికి బయలుదేరిన అంగన్వాడీ టీచర్లను డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం వద్ద అడ్డుకుని పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి స్టేషన్లకు తరలించారు.
అంగన్వాడీలను బెదిరించిన పోలీసులు: దీంతో తమ హక్కులను హరించడం అన్యాయమంటూ సీఐ దుర్గారావు, ఎస్ఐ సురేష్‌లతో అంగన్వాడీలు టీచర్ల వాగ్వివాదానికి దిగారు. దీంతో అంగన్వాడీ టీచర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని పోలీసులు బెదిరించారు. పోలీసుల చర్యలతో చేసేది ఏమీ లేక అంగన్వాడీ టీచర్లు వెనుదిరిగారు.
పోలీసులను నిలదీసిన అంగన్వాడీ నాయకురాలు: అంగన్వాడీ కార్యకర్తలు (Anganwadi Workers) చేపట్టిన ఆందోళనలు ముందస్తు నోటీసులు ఇచ్చి అడ్డుకునేందుకు వచ్చిన పోలీసులను అంగన్వాడీ నాయకురాలు నిలదీశారు. 30 ఏళ్లుగా పనిచేస్తున్నా 11 వేల 500 రూపాయలే ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి తోడు రాజకీయ ఒత్తిళ్లతో చాలా ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. ప్రమోషన్లు కూడా ఇవ్వడం లేదని.. నాలుగేళ్లుగా పెన్షన్ రాక అనేక మంది తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. రిటైర్ అయినా, లేదంటే ఎవరైనా చనిపోయినా.. వారికి ఎళ్లుగా పెన్షన్ పెండింగ్‌లో పెట్టారని పోలీసులు ఎదుట తమ ఆవేదని వెలిబుచ్చారు.
Anganwadi Workers Called for Protest: వేధింపులను నిరసిస్తూ.. ఆందోళనకు సిద్ధమైన అంగన్వాడీలు
విజయవాడ ధర్నాచౌక్‌లో చేపట్టిన ఆందోళనకు వెళుతున్న అంగన్వాడీ నాయకురాలు మాబున్నీషాను శ్రీ సత్య సాయి జిల్లా కదిరి పోలీసులు ముందస్తు నోటీసుతో అడ్డుకున్నారు. జగన్మోహన్ రెడ్డి సర్కారు ఏర్పాటైన నాలుగేళ్లలో అంగన్వాడీ కార్యకర్తలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పోలీసుల ఎదుట ఆమె ఏకరువు పెట్టారు.
సమాధానం చెప్పాకే నోటీసు ఇవ్వాలి: ప్రజాస్వామ్యబద్ధంగా తమ సమస్యలను చెప్పుకునే అవకాశం లేకుండా ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. అంగన్వాడీ కార్యకర్తలకు అందాల్సిన సదుపాయాలను ప్రభుత్వం గండి కొట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆందోళనకు మద్దతు ఇస్తూనే కార్యక్రమంలో పాల్గొనకుండా అడ్డుకోవడమేంటని మాబున్నీషా పోలీసులను ప్రశ్నించారు. తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులకు సమాధానం చెప్పాకే నోటీసు ఇవ్వాలన్నారు.