Prabhala Tirtha for Republic Parade: ఆంధ్రప్రదేశ్‌లోని బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో జరిగే ప్రభల తీర్థం ఈ వేడుకల్లో ఊరేగించే ఏకాదశ రుద్రుల నమూనాకు అరుదైన గౌరవం దక్కింది. ఈ నమూనా దిల్లీలోని కర్తవ్యపథ్‌లో జరగనున్న గణతంత్ర వేడుకల్లో రాష్ట్ర శకటంపై కొలువుతీరనుంది. దిల్లీలో జరిగే గణతంత్ర వేడుకల్లో ఒక రాష్ట్ర శకటానికి చోటు దక్కడం అరుదైన విషయమే. దేశంలోని మిగతా రాష్ట్రాలతో పోటీ పడుతూ ఏదో ప్రత్యేకత చాటుకుంటేనే వేడుకల్లో శకటానికి చోటు దక్కేది. అలా ఈసారి వేడుకల్లో చోటు దక్కించుకున్న ఆంధ్రప్రదేశ్ శకటం గొప్ప ఘట్టానికి వేదిక కాబోతోంది.
బీఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని జగ్గన్నతోటలో సంక్రాంతి సందర్భంగా జరిగే ప్రభల తీర్థం వేడుకల నేపథ్యంగా రూపొందించిన ఆంధ్రప్రదేశ్ శకటం 74వ గణతంత్ర వేడుకల సందర్భంగా కర్తవ్యపథ్‌లో జరిగే కవాతులో పాల్గొననుంది. కోనసీమ పల్లెల్లో జరిగే సంక్రాంతి సంబరాలను ఈ శకటం ఆవిష్కరించనుంది. తెలుగువారి సంస్కృతీ, సంప్రదాయానికి చిరునామాగా నిలిచే సంక్రాంతి ముగిసి 10రోజులు అవుతున్నా ప్రభల తీర్థం శకటం... దిల్లీ వీధుల్లో పండగ వేడుకలకు ప్రతిబింబంగా నిలవనుంది. తెలుగువారి పండగల గొప్పదనాన్ని దేశానికి సగర్వంగా చాటనుంది.
ప్రభల తీర్థం వేడుకలు దిల్లీ గణతంత్ర వేడుకల్లో ప్రతిబింబించడానికి కారణం ఆ ఉత్సవాలకు ఉన్న ప్రత్యేకతే. డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని అంబాజీపేట మండలం మొసలపల్లి శివారులో ఉన్న జగ్గన్నతోటలో ఏటా సంక్రాంతి మరుసటి రోజైన కనుమరోజు ప్రభల తీర్థం వేడుకలు జరుగుతాయి. ఈ వేడుకలకు 450 సంవత్సరాల చరిత్ర ఉంది. ఇవి ఏ గుడి వద్దో జరగదు. మొసల్లపల్లి అనే గ్రామంలోని జగన్నతోట అని పిలిచే 7ఎకరాల కొబ్బరితోటలో జరుగుతాయి. ఆ తోటలో ఏ దేవాలయమూ ఉండదు. కొబ్బరిచెట్లు, చుట్టూ వరిపొలాలు మాత్రమే కనిపిస్తాయి. 17 వ శతాబ్దంలో ఓ సారి జగన్నాథుడనే పెద్దాపురం జమీందారు ఈ తీర్థానికి భారీ ఎత్తున విరాళం ఇచ్చాడని, ఆయనను ప్రజలు జగ్గన్న అని పిలిచేవారని అంటారు. ఆయన పేరు మీదనే ఈ తోటను జగ్గన్నతోట అని పిలుస్తారని చెబుతారు.
లోకకళ్యాణార్థం ఏటా కనుమ రోజు పరమశివుని స్వరూపంగా పేర్కొనే ఏకాదశ రుద్రులు జగ్గన్న తోటలో సమావేశం అవుతారని ప్రతీతి. ఆ సందర్భంగా కొన్ని వందల సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్న విశిష్ఠ వేడుకను ప్రభల తీర్థం అని అంటారు. కోనసీమ ప్రజల సంస్కృతీ సంప్రదాయాలు చాటుతూ ఈ వేడుకలను జగ్గన్నతోటలో నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ప్రభ అంటే ఈశ్వరుడి ప్రతిరూపం. ఆధ్యాత్మికత శోభిల్లేలా రంగు రంగుల నూలుతో ప్రభలను నయనానందకరంగా తీర్చిదిద్ది కనుమ రోజున భక్తులు జగ్గన్నతోట తీర్ధానికి భుజాలపై మోసుకు వస్తారు. ప్రభలకు శిఖర భాగంలో త్రిశూలం, మధ్యభాగంలో మకరతోరణంతో ఉన్న మహారుద్రుడి ఉత్సవ ప్రతిమను కొలువుతీర్చి ప్రభలను తయారు చేస్తారు.
దేశంలో మరెక్కడా లేనివిధంగా 11 ఊళ్ల నుంచి ఏకాదశ రుద్రులుగా పిలిచే పదకొండు శివ స్వరూపాలను కనుమ రోజు ప్రభలపై ఒకే చోటికి తరలిస్తారు. ప్రభల తీర్థం ఉత్సవం జరిగేది మొసల్ల పల్లి గ్రామంలో కాబట్టి ఆ ఊరి రుద్రుడైన భోగేశ్వరుడు మిగతా ఊళ్ల నుంచి వచ్చే రుద్రులకు ఆతిథ్యం ఇస్తాడు. ఈ 11 రుద్రుల సమావేశానికి వ్యాఘ్యేశ్వరుడు అనే రుద్రుడు అధ్యక్షత వహిస్తాడు. అందువల్ల వ్యాఘ్యేశ్వరుడి ప్రభ తోటలోకి ప్రవేశించగానే మిగతా రుద్రులంతా లేచి నిలబడతారు. అలా లేచి నిలబడడానికి ప్రతీకగా భక్తులు ప్రభలు అన్నింటినీ హరహర, శరభ, శరభ అంటూ ఒకేసారి పైకి లేపుతారు. అందరికంటే గంగలకుర్రు అగ్రహారపు వీరేశ్వరుడు సమావేశానికి ఆలస్యంగా వస్తాడు. ఆయన వచ్చేదారిలో కౌశికీ నదిని దాటాల్సి ఉంటుంది. వీరేశ్వరుడు నదిని దాటే దృశ్యం కన్నుల పండుగగా ఉంటుంది.
వీరేశ్వరుడు జగ్గన్నతోటకు వచ్చే సరికి సాయంత్రం సమయం అవుతుంది. ఈ రుద్రుడి ప్రభ తోటకు చేరిన కొద్దిసేపటికి ఉత్సవం ముగుస్తుంది. అనంతరం రుద్రులంతా తిరిగి తమతమ గ్రామాలకు చేరుకుంటారు. ఈ మొత్తం ప్రభల తీర్థం ఉత్సవాన్ని ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. వరి పొలాలు, కాలువల మధ్య నుంచి ప్రభలను మోసుకువెళతారు. వేడుకలు చూసేందుకు వేలాది మంది జనం వస్తారు. కోనసీమ జిల్లా నుంచే కాక చుట్టుపక్కల జిల్లాలు, దేశవిదేశాల నుంచి కూడా ప్రజలు వస్తారు. ఈ ప్రాంతానికే ప్రత్యేకమైన ఈ ఉత్సవాలను చూసి నయనానందం పొందుతారు. ప్రభలపై అందమైన రూపంలో కొలువై ఉండే పరమశివుడి 11 దివ్య రూపాలను దర్శించుకుని ఆధ్యాత్మిక ఆనందం పొందుతారు. ఊళ్లన్నీ ఒక్క చోట కొలువయ్యాయా..! అన్నట్లు కనుమరోజు జరిగే ప్రభల తీర్థం వేడుకల సందర్భంగా మిన్నంటిన సందడే నెలవై ఉంటుంది.
జగ్గన్నతోట ప్రభలు గణతంత్ర వేడుకల శకటంపై కొలువుతీరడం వెనక అంబాజీపేట మండలం గంగలకుర్రు గ్రామానికి చెందిన శివకేశవ యూత్ సభ్యుల కృషి ఉంది. ఈ తీర్థం, ఇక్కడ జరిగే ప్రభల విశేషాలను వివరిస్తూ యూత్ సభ్యులు 2020లో ప్రధానమంత్రి మోదీకి లేఖ రాశారు. దీనికి ప్రధాని ప్రతిలేఖ రాశారు. 4 శతాబ్దాల నుంచి కోనసీమలోని జగ్గన్నతోటలో ప్రభల ఉత్సవం జరపడం సంతోషకరం అని అన్నారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయల పరిరక్షణకు గ్రామీణ ప్రాంతాలు పట్టుకొమ్మలుగా నిలుస్తాయని, ఏకాదశ రుద్రుల ఆశీస్సులు సమస్త మానవాళికి ఉండాలని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. అలాగే 2021లో శృంగేరి పీఠాధిపతులు విదుశేఖర భారతీమహాస్వామి సందేశమిస్తూ ఏకాదశ రుద్రుల సంగమం లోక కల్యాణం కోసమేనని అన్నారు. ఈ ప్రభల ఉత్సవానికి సంబంధించిన ఇలాంటి అనేక అంశాలను పరిగణలోనికి తీసుకున్న కేంద్రప్రభుత్వం ఈ ఉత్సవ ప్రాధాన్యం గుర్తించి జనవరి 26న నిర్వహించే గణతంత్ర వేడుకల్లో ఏకాదశ రుద్రుల ప్రభల శకటాన్ని రూపొందించి ప్రదర్శించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. అలా గణతంత్ర వేడుకల్లో జగ్గన్నతోట ప్రభల వేడుకలను ప్రతిబింబించే శకటం చోటు దక్కించుకుంది.
గణతంత్ర వేడుకల ద్వారా ప్రభల తీర్థం వేడుకలను దేశవ్యాప్తంగా పరిచయం చేసే అవకాశం దక్కడంతో ఆ ఉత్సవాలను పూర్తి స్థాయిలో ప్రతిబింబించేలా ఆంధ్రప్రదేశ్ శకటాన్ని చూడచక్కగా రూపొందించారు. పరేడ్ శకటంపై ఉంచే ప్రభలను తాటి శూలం, టేకు చెక్క, మర్రి ఊడలు, వెదురు బొంగులు, రంగుల నూలుదారాలు, నెమలి పింఛాలు, వరికంకులు, కూరగాయలతో కనువిందుగా తయారు చేశారు. శకటానికి 3 వైపులా 3 చొప్పున 9చిన్న ప్రభలు, శకటం మధ్యలో 2 పెద్దప్రభలు తయారు చేశారు. కొబ్బరిచెట్లు, మేళతాళాలు, గరగ నృత్యకారులు, వేదపండితులు, పల్లకి, దానిని మోస్తున్న బోయీలు, తీర్థానికి గూడెడ్ల బండి మీద వచ్చే ప్రజల నమూనాతో శకటాన్ని తీర్చి దిద్దారు. వరికుచ్చులు, గుమ్మడికాయలు, ఇతర కూరగాయలను కూడా అలంకరించారు.
గణతంత్ర వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభల శకటాన్ని ప్రదర్శించే సందర్భంగా రాష్ట్ర సంస్కృతి ప్రతింబించనుంది. శకటం ప్రదర్శన సందర్భంగా గరగ నృత్యాన్ని ప్రదర్శించ నున్నారు. అంబాజీపేట మండలం ముక్కామలకు చెందిన పసుపులేటి నాగబాబు బృందం ఈ ప్రదర్శన ఇవ్వనుంది. ఈ బృందంలో సుమారు 24 మంది ఉన్నారు. గతంలో నాగపూర్ కల్చరల్ సెంటర్ ద్వారా ఈ బృందం 15సార్లు పరేడ్‌లో పాల్గొంది. అయితే ఈసారి ప్రభల తీర్థం శకటం ప్రదర్శన సందర్భంగా ఈ బృందానికి నేరుగా పాల్గొనే అవకాశం దక్కింది. తెలుగు లోగిళ్లు అనేక సంస్కృతి, సంప్రదాయాలకు నెలవు. దేశంలో మరెక్కడా లేని ఉత్సవాలు, వేడుకలకు తెలుగురాష్ట్రాలు వేదికలు. అలాంటి ప్రాంతం నుంచి ప్రభల తీర్థం ఉత్సవాలు గణతంత్ర వేడుకల శకటంపై ప్రతిబింబిచడం తెలుగురాష్ట్రాలకు గర్వకారణం. దిల్లీ వీధుల్లో ఈ వేడుకల శకటం కనువిందు చేసిన తర్వాత ప్రభల ఉత్సవ గొప్పతనం దేశమంతటా విస్తరించగలదని కోనసీమ ప్రజలు ఆశాభావంతో ఉన్నారు.
ఇవీ చదవండి :