NGT fine on Palamuru-Ranga Reddy project: తెలంగాణలోని పాలమూరు - రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాల ప్రాజెక్టు పనులపై జాతీయ హరిత ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పు విషయంలో తదుపరి చేపట్టాల్సిన కార్యాచరణపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. అనుమతులు లేకుండా పనులు కొనసాగించారంటూ ఎన్జీటీ రాష్ట్ర ప్రభుత్వానికి 920 కోట్ల రూపాయల జరిమానా విధించింది. ఇంజినీర్లతో నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ సమావేశమయ్యారు. ట్రైబ్యునల్ తీర్పులోని అంశాలు, రాష్ట్ర ప్రభుత్వ వాదనలు, వచ్చిన అభ్యంతరాలపై సమావేశంలో చర్చించారు.
న్యాయపరంగా ఎలా ముందుకెళ్లాలన్న విషయంపై సమాలోచనలు జరిపారు. రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదులతో చర్చించాలని ఇంజినీర్లను రజత్ కుమార్ ఆదేశించారు. ట్రైబ్యునల్ తీర్పుపై సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. వాదనలు సరిగ్గా వినిపించలేదని ఇంజినీర్లపై ఒకింత అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. న్యాయవాదులతో సమావేశం తర్వాత అన్ని అంశాలను ముఖ్యమంత్రి కేసీఆర్కు నివేదించాలని.. సీఎం నిర్ణయానికి అనుగుణంగా తదుపరి కార్యాచరణ అమలు చేయనున్నారు.
ఇవీ చదవండి: