Kriya Children Festival at Kakinada JNTU: నిత్యం తరగతి గదుల్లో పాఠ్యపుస్తకాలతో సతమతమయ్యే విద్యార్థులు కళా వేదికపై తమ ప్రతిభకు పదును పెడుతూ అలరించారు. వివిధ అంశాల్లో సాంస్కృతిక ప్రదర్శనలతో ఔరా అనిపించారు. చిన్నారుల్లోని సృజనాత్మకతను, వారిలోని సాంస్కృతిక ప్రతిభను వెలికితీసే క్రియా పిల్లల పండగ కాకినాడ జేఎన్‌టీయూలో (Jawaharlal Nehru Technological University) అట్టహాసంగా ప్రారంభమైంది. రాష్ట్ర నలుమూలల నుంచి వేలాది మంది విద్యార్థులు తరలివచ్చి పలు విభాగాల్లో ఉత్తమ ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు.
కాకినాడ జేఎన్‌టీయూ ప్రాంగణంలో క్రియా ఆధ్వర్యంలో పిల్లల పండగ ఉత్సాహంగా సాగుతోంది. రెండురోజుల పాటు జరిగే ఈ ఉత్సవానికి రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 400 పాఠశాలల నుంచి 10 వేల 2 వందల మంది విద్యార్థులు తమ తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో కలసి హాజరయ్యారు. ఏకపాత్రాభినయం, చిత్రలేఖనం, సంగీతం, క్విజ్, లఘు నాటికలు, కథా రచన, కథా విశ్లేషణ, మట్టి బొమ్మల తయారీ వంటి 29 అంశాలతో విద్యార్థులకు పోటీలు నిర్వహిస్తున్నారు. పోటీల్లో ఉచిత ప్రవేశంతో పాటు అల్పాహారం, భోజన సదుపాయాలు కల్పిస్తున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి నిర్వాహకులు వసతి సౌకర్యం కూడా కల్పించారు. పలు అంశాల్లో తమ ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తున్నారని వేలాది మంది విద్యార్థులతో కలసి ఈ ఉత్సవంలో పాల్గొనడం సంతోషంగా ఉందని విద్యార్థులు చెబుతున్నారు.
పలు రకాల వేషధారణలతో అలరించిన విద్యార్థులు.. వేల మంది విద్యార్థులు, ఉపాధ్యాయులతో జేఎన్‌టీయూ ప్రాంగణంలో పండుగ వాతావరణం నెలకొంది. చిన్నారులు తమ ప్రతిభను నిరూపించుకునేందుకు క్రియ ఆధ్వర్యంలో జేఎన్‌టీయూ చక్కటి వేదికగా మారిందని వివిద పాఠశాలల నుంచి వచ్చిన ఉపాధ్యాయులు అభిప్రాయ పడ్డారు. చిన్నారులు రాముడు, కృష్ణుడు, అల్లూరి, రాణి రుద్రమదేవి తదితర వేషధారణలతో అలరించారు. పోటీల నిర్వహణకు ఆయా అంశాల్లో నిష్ణాతులైన అనుభవజ్ఞులను న్యాయనిర్ణేతలుగా నియమించారు. ఇలాంటి కార్యక్రమాలతో విద్యార్థులకు కళలపై ఆసక్తి పెరుగుతుందని ఉపాధ్యాయులు ఆభిప్రాయపడ్డారు.
పదేళ్లుగా పోటీలను నిర్వహిస్తోన్న క్రియా సంస్థ.. చిన్నారుల్లో కళా నైపుణ్యాన్ని వెలికితీసేందుకు క్రియా సంస్థ పదేళ్లుగా ఈ పోటీలను నిర్వహిస్తోంది. పండగ వాతావరణంలో ఇలాంటి పోటీలను నిర్వహించడంతో ఎంతో ఉల్లాసంగా ఆనందంగా ఉందని విద్యార్థులు అన్నారు. ఎవరికి ఏ అంశంలో ఇష్టం ఉంటే వాటిలో రాణించడానికి క్రియ పిల్లల పండగ (Kriya Children Festival) చక్కటి అవకాశాన్ని ఇచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందని విద్యార్థులు చెబుతున్నారు. గత ఏడాది కంటే ఈ ఏడాది జేఎన్‌టీయూలో క్రియా పండగను ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక ప్రతిభావంతులైన పిల్లలందరికి బహుమతులు అందించారు.