YANAM FLOODS కాకినాడ జిల్లాలో అంతర్భాగంగా ఉన్న కేంద్రపాలిత ప్రాంతమైన యానాం ప్రజలను వరద కష్టాలు వీడడం లేదు. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి గత వారంలో లక్షలాది క్యూసెక్కుల వరద నీరు సముద్రంలోకి వదలడంతో.. గౌతమీ గోదావరి నదీపాయకు ఆనుకుని ఉన్న ఎనిమిది కాలనీలు పది రోజులపాటు నీటిలోనే చిక్కుకున్నాయి. ఇప్పుడిప్పుడే కోలుకుని రోజు వారి జీవనానికి అలవాటుపడిన ప్రజలకు మళ్లీ వరద నీరు పోటెత్తింది. దీంతో ఫ్రాన్స్తిప్ప, కోన వెంకటరత్నం నగర్, ఫెర్రీ రోడ్ కాలనీలు ముంపునకు గురయ్యాయి. సుమారు 1500 కుటుంబాలు ఐదు రోజులుగా వరద నీటిలోనే ఉండడంతో పుదుచ్చేరి మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు ఆధ్వర్యంలో.. దాతల సహకారంతో రెండు పూటలకు సరిపడే భోజనాలు, త్రాగునీటిని పడవలపై తీసుకువెళ్లి బాధితులకు ఇంటి వద్దనే అందజేస్తున్నారు.
పుదుచ్చేరి రాష్ట్ర ప్రభుత్వం గత నెలలో వచ్చిన వరదల సమయంలో తక్షణ సహాయంగా 5 వేల రూపాయలు బాధితులకు అందజేసింది. నెలరోజులు గడవక ముందే మళ్లీ వరదలు రావడంతో ప్రభుత్వం ఏ మాత్రం స్పందించలేదు. స్థానిక అధికారులు బాధితులను పునరావాస కేంద్రాలకు రావాలని కోరుతున్నా.. ఎవరూ రాకపోవడంతో ఆ ప్రాంతాల్లో ఏ విధమైన ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా రెవెన్యూ, పోలీస్ శాఖలు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నాయి.
ఇవీ చదవండి: