ED investigation in Granite mining case : గ్రానైట్ కంపెనీల ‘ఫెమా’ నిబంధనల ఉల్లంఘన కేసులో బాధ్యులకు నోటీసులు జారీ చేసి.. వాంగ్మూలాల నమోదుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సిద్ధమవుతోంది. విదేశాల్లో జూదానికి సంబంధించిన కేసులో ఈడీ ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులను విచారిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో గ్రానైట్ కేసు కూడా మరోమారు రాజకీయంగా దుమారం రేపే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
ED investigation in Granite mining case update : సీనరేజి ఎగ్గొట్టేందుకు.. ఎగుమతి చేసిన గ్రానైట్‌ను తక్కువగా నమోదు చేశారని 2013లో విజిలెన్స్-ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన సంగతి తెలిసిందే. ఎగుమతుల్లో పదోవంతును మాత్రమే రికార్డుల్లో చూపి.. ఆ మేరకే సీనరేజి చెల్లించారని, ఇలా ఎగ్గొట్టిన సీనరేజ్ రూ.124 కోట్లు ఉందని అప్పట్లోనే లెక్కతేల్చారు. దీనికి సంబంధించి ఆయా సంస్థలకు 5 రెట్లు జరిమానా విధించారు.
సీనరేజి వసూలు రాష్ట్రం పరిధిలోని అంశం కావడంతో.. 2016లో రాష్ట్ర ప్రభుత్వం ఈ జరిమానాను రద్దు చేసింది. అయితే అనధికారికంగా ఎగుమతి చేసిన గ్రానైట్‌కు సంబంధించిన విదేశీ చెల్లింపులు హవాలా మార్గంలో జరిగాయని, ఇదంతా విదేశీ మారకద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) పరిధిలోకి వస్తుందంటూ ఈడీ రంగంలోకి దిగింది. ఇటీవల కరీంనగర్‌కు చెందిన 8 గ్రానైట్ సంస్థల్లో సోదాలు నిర్వహించింది.
ఇందులో రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్‌కు చెందిన శ్వేత గ్రానైట్స్, శ్వేత ఏజెన్సీస్ కూడా ఉన్నాయి. గ్రానైట్ ఎగుమతుల్లో అనేక అక్రమాలు జరిగాయని, అనధికారిక ఎగుమతులకు సంబంధించిన చెల్లింపుల కోసం ఉద్యోగులు, ప్రైవేటు వ్యక్తుల పేర్లతో బినామీ ఖాతాలు తెరిచారని, విదేశాల నుంచి ఆయా ఖాతాల్లో పెద్దమొత్తంలో డబ్బు జమ అయినట్లు ఈడీ సోదాల్లో బయటపడింది.
గత పదేళ్లుగా జరుగుతున్న ఇలాంటి అక్రమాలకు సంబంధించి కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నామని ఈడీ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. సోదాల్లో స్వాధీనం చేసుకున్న పత్రాలను ఈడీ అధికారులు విశ్లేషిస్తున్నారు. తదుపరి దర్యాప్తులో భాగంగా బాధ్యులను విచారించి, వారి వాంగ్మూలం నమోదు చేయాలని భావిస్తున్నారు. సోదాలు జరిపిన ఎనిమిది సంస్థలకు సంబంధించి చట్టబద్ధమైన బాధ్యులను గుర్తించి, వారందరికీ నోటీసులు జారీ చేయనున్నారని సమాచారం. గ్రానైట్ దిగుమతి చేసుకున్న విదేశీ సంస్థల వివరాలనూ ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు.
ఇవీ చదవండి: