CM Jagan Samalkot Public meeting comments: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం సామర్లకోటలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రతిపక్ష నాయకులు, వారి కుటుంబ సభ్యులపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మరోసారి వ్యక్తిగత విమర్శలకు దిగారు. చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్‌లు ఏపీలో నివాసం ఉండరంటూ వ్యాఖ్యానించారు.
Jagananna Colony Houses Started: కాకినాడ జిల్లా సామర్లకోటలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి జగనన్న కాలనీల ఇళ్లను ప్రారంభించారు. అనంతరం జగనన్న కాలనీలో ఏర్పాటు చేసిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆ తర్వాత సామర్లకోట ప్రభుత్వ జూనియర్ కాలేజీ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న సీఎం.. దేశంలో ఎప్పుడూ జరగని విధంగా పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ చేశామని ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. రెండేళ్లలోనే పేదల సొంతింటి కలను నెరవేర్చామన్నారు. 31 లక్షల కుటుంబాలకు ఇళ్ల స్థలాలను కేటాయించామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మరో 17 వేల జగనన్న కాలనీలు ఏర్పాటు అవుతున్నాయని పేర్కొన్నారు.
Cm Jagan Comments: ''మేము అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే 80శాతం ఇళ్లు పూర్తిచేశాం. కట్టినవి, కడుతున్నవి ఇళ్లు కాదు.. ఊళ్లు. రాష్ట్రంలో 22 లక్షల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. ఇప్పటికే 7 లక్షల 40 వేల ఇళ్ల నిర్మాణం పూర్తిచేశాం. రాష్ట్ర వ్యాప్తంగా మరో 14.33 లక్షల ఇళ్ల నిర్మాణం వేగంగా జరుగుతోంది. ఒక్కో ఇంటికి 2 లక్షల 70 వేల రూపాయలు ఖర్చు చేస్తున్నాం. మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసినా చంద్రబాబు నియోజకవర్గం కుప్పంతో సహా ఎక్కడా పేదలకు ఇంటి స్థలం, ఇళ్ల నిర్మాణం చేపట్టలేదు. ఎప్పుడైనా రాష్ట్రంలో నిరంతరంగా చంద్రబాబు కనిపించాడా..? ఇప్పుడు మాత్రమే రాజమహేంద్రవరంలో కనిపిస్తున్నారు'' అని సీఎం జగన్ సామర్లకోట బహిరంగ సభలో విమర్శలు చేశారు. అంతేకాకుండా, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ముఖ్యమంత్రి జగన్ మరోసారి వ్యక్తిగతంగా విమర్శలు చేశారు. పవన్ కల్యాణ్ పెళ్లిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.
''పవన్ ఇల్లు హైదరాబాద్‌లో ఉంది. ఆ ఇంట్లో ఇల్లాలు ప్రతి మూడేళ్లకు, నాలుగేళ్లకోసారి మారిపోతారు. ఓసారి లోకల్, మరొకసారి నేషనల్, ఇంకోసారి ఇంటర్నేషనల్. ఆడవారంటే గౌరవం లేదు. ఆయన పోటీ చేసిన భీమవరంతో సంబంధం లేదు. గాజువాకతో అనుబంధం లేదు. తన అభిమానుల ఓట్లు హోల్‌సేల్‌గా అమ్ముకునేందుకు వచ్చి పోతుంటాడు. సొంత పార్టీని, సొంత వర్గాన్ని వేరే వారికి అమ్ముకునే వారిని ఇక్కడే చూస్తున్నా.'' - వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, రాష్ట్ర ముఖ్యమంత్రి