YSRCP Corporator Dupati Vamsibabu: గుంటూరులో వైసీపీ కార్పొరేటర్ దూపాటి వంశిబాబు.. వార్డు సచివాలయ సిబ్బందిపై రెచ్చిపోయారు. 53వ డివిజన్ పరిధిలోని వసంతరాయపురంలో రహదారి వెంట ఆక్రమణల్ని నగరపాలక సంస్థ సిబ్బంది తొలగిస్తున్నారు. వార్డు సచివాలయ సిబ్బంది సైతం అధికారులతో ఉన్నారు. స్థానిక కార్పొరేటర్దూ పాటి వంశిబాబు ఆక్రమణల తొలగింపును అడ్డుకున్నారు. వార్డు సచివాలయ సిబ్బందికి ఆక్రమణలతో పనేంటని ప్రశ్నించారు.
వెళ్లి పెన్షన్లు ఇచ్చుకోవాలని... అనవసర విషయాల్లోకి రావొద్దని హెచ్ఛరించారు. కులం పేరుతో వివక్ష చూపిస్తున్నారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదైనా ఉంటే నేను కమిషనర్‌తో మాట్లాడతా.. మీరేమీ తొలగించాల్సిన పనిలేదని అధికారులపై మండిపడ్డారు. ఉన్నతాధికారులతో విషయం చెప్పాలని... వాళ్లు తొలగించేందుకు వచ్చినప్పుడు కూడా తన దృష్టికి తీసుకురావాలని హుకుం జారీ చేశారు. జరిగిన ఘటనపై ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వగా వారి నుంచి సానుకూల స్పందన లేకపోవటంతో వార్డు సచివాలయ సిబ్బంది మౌనంగా ఉండిపోయారు.
కనీసం కమిషనర్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లేందుకు జంకుతున్నారు. ఇటీవల శ్రీనగర్ కాలనీలో నగరపాలక సంస్థ సిబ్బంది రోడ్డు విస్తరణ పేరుతో ఇళ్లు కూల్చివేశారు. ఉన్నతాధికారులు సైతం దాన్ని సమర్థించుకున్నారు. రోడ్డు పక్కన ఆక్రమణల విషయంలో వార్డు సచివాలయ సిబ్బంది ఉదాసీనంగా ఉండొద్దని ఆదేశాలు జారీ చేసిన ఉన్నతాధికారులు... అధికార పార్టీ నేతలు అడ్డుకుంటే మాత్రం మౌనంగా ఉండిపోవటం పలు విమర్శలకు తావిస్తోంది.
ఇవీ చదవండి: