పేద ప్రజలందరికీ వైద్యం అందుబాటులో ఉండాలని రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్య శ్రీ హెల్త్‌కార్డులను పంపిణీ చేశారు. జిల్లా కలెక్టర్లు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
గుంటూరు జిల్లాలో..
వైయస్సార్ ఆరోగ్య హెల్త్‌కార్డుల పథకాన్ని గుంటూరులో ఘనంగా ప్రారంభించారు. గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్, ఎమ్మెల్యేలు మద్దాలి గిరి, ముస్తఫా, ఎమ్మెల్సీ లక్ష్మణరావు పాల్గొన్నారు. అనంతరం అర్హులైన వారికి ఆరోగ్యశ్రీ కార్డులను అందజేశారు. పేదలకు కార్పొరేట్ వైద్యం అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పధకాన్ని ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ చెప్పారు. జిల్లాలోని అన్ని మండల కేంద్రాలలో ఆరోగ్యశ్రీ కార్డులు అందజేస్తున్నామని తెలిపారు. ఇంకా ఎవరైనా నమోదు చేసుకోకపోతే వారు తక్షణమే నమోదు చేసుకోవాలని సూచించారు.
ప్రకాశం జిల్లాలో...
వైఎస్సార్ ఆరోగ్య శ్రీ హెల్త్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి బాలినేని బాలినేని శ్రీనివాసులు రెడ్డి ఒంగోలులో ప్రారంభించారు. ఒంగోలులోని ఎన్టీఆర్ కళాక్షేత్రంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి బాలినేని లబ్ధిదారులకు హెల్త్ కార్డులను పంపిణీ చేశారు. ప్రకాశం జిల్లాలో 9లక్షల మందికి వైఎస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డులను కార్డులు అందజేస్తున్నామని మంత్రి తెలిపారు. హెల్త్ కార్డు ద్వారా ఆపరేషన్ చేయించుకున్న వారికి జీవనభ్రుతి కింద 5 వేల రూపాయలు ఆర్ధిక సాయం అందిస్తున్నామన్నారు.
కర్నూలు జిల్లాలో..
ఆదోనిలో ఆరోగ్యశ్రీ కార్డులను లబ్దిదారులకు జిల్లా కలెక్టర్ వీర పాండ్యన్ పంపిణీ చేశారు. పురపాలక కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా పక్క రాష్ట్రాల్లో కూడా ఆరోగ్య శ్రీ ద్వారా ఉచితంగా చికిత్స చేయించుకోవచ్చన్నారు. కర్ణాటక సరిహద్దు ప్రాంతం ఆదోనిలో ఆరోగ్యశ్రీ తో బెంగళూర్‌లో చికిత్స చేయించుకోవాలని... ఏప్రిల్ నాటికి 2059 రకాల జబ్బులు ఆరోగ్య శ్రీలో అమలు చేస్తామని కలెక్టర్ వీర పాండ్యన్ తెలిపారు.
కడప జిల్లాలో...
ప్రొద్దుటూరు పురపాలక కార్యాలయంలో వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పత్రాల పంపిణీ కార్యక్రమం జరిగింది. జిల్లా కలెక్టర్ హరికిరణ్, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి హాజరై... పత్రాలను లబ్ధిదారులకు అందించారు. అందులో ఉన్న జబ్బుల వివరాలను ప్రజలకు వివరించారు. డబ్బు ఖర్చు కాకుండా ప్రాణాలు నిలుపుకునేందుకు ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కార్డులో జబ్బులను పెంచిందని జిల్లా కలెక్టర్ హరికిరణ్ అన్నారు. ఆరోగ్యశ్రీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ప్రజలకు సూచించారు.
అనంతపురం జిల్లాలో..
గుంతకల్లులో ఎమ్మెల్యే వై.వెంకట్రామిరెడ్డి లబ్దిదారులకు వైఎస్సార్ ఆరోగ్య శ్రీ హెల్త్ కార్డులు పంపిణీ చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి... నవ రత్నాల ద్వారా అందరికీ సంక్షేమ పథకాలు అందేలా పరిపాలన చేస్తున్నారన్నారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌గా మార్చాలని ఉద్దేశ్యంతో 1000కు పైగా రోగాలను నయం చేయడానికి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. హెల్త్ కార్డులను ప్రతి ఒక్కరూ భద్రంగా దాచుకోవాలని చెప్పారు.
మడకశిర పట్టణంలో డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డులు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు, మంత్రి మాల గుండ్ల శంకర్ నారాయణ, మడకశిర ఎమ్మెల్యే తిప్పేస్వామి పాల్గొన్నారు. జిల్లావ్యాప్తంగా 12 లక్షల 8 వేల మంది ఆరోగ్యశ్రీకి అర్హులుగా ఉన్నారని కలెక్టర్ తెలిపారు. వీరికి ఫిబ్రవరి 28వ తేదీ వరకు విడతల వారీగా కార్డుల పంపిణీ కార్యక్రమం చేపడతామన్నారు. వైద్యం కోసం ఉట్టి చేతులతో ఆసుపత్రికి వెళితే అక్కడ రోగానికి సంబంధించిన శస్త్ర చికిత్స చేసి తిరిగి పోస్టల్ ఆపరేషన్ మందులకు గాను ప్రభుత్వం డబ్బులు చెల్లిస్తుందని కలెక్టర్ తెలిపారు.
ఇదీ చదవండి :
నేడు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ...ఏలూరులో సీఎం శ్రీకారం