Young Woman Murdered : గుంటూరు జిల్లా తాడేపల్లి ఎన్టీఆర్ కట్టపై దారుణం జరిగింది. గంజాయి మత్తులో ఓ యువకుడు కత్తితో దాడి చేసి యువతిని హత్య చేశాడు. సీఎం నివాసానికి సమీపంలోనే ఈ ఘటన జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజు అనే యువకుడు తరచు గంజాయి సేవించి రోడ్డుపై వెళ్తున్న యువతులను, మహిళలను వేధించేవాడని తెలిపారు. ఆదివారం కూడా ఓ అంధ యువతి పట్ల రాజు అసభ్యంగా ప్రవర్తించాడు.
రాజు వేధింపులకు భయాందోళనకు గురైన యువతి అక్కడి నుంచి ఇంటికి వెనుదిరిగింది. అదే రోజు రాత్రి పదిన్నర సమయంలో రాజు ఆ యువతి ఇంటికి గంజాయి మత్తులో వెళ్లాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న యువతిపై కత్తితో దాడి చేశాడు. దాడిలో ఆంధ యువతి తీవ్రంగా గాయపడింది. దాడి చేసిన రాజు అక్కడి నుంచి పరారయ్యాడు. గమనించిన స్థానికులు యువతిని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి తరలించిన కొద్దిసేపటికే మరణించినట్లు వైద్యులు తెలిపారని యువతి బంధువులు వెల్లడించారు.
తాడేపల్లిలో విచ్చలవిడిగా మత్తుపదార్థాలు దొరుకుతున్నాయని ఆరోపించారు. గట్టి చర్యలు తీసుకోవాలని అధికార పార్టీ నాయకులే పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలిపారు. రాజు తరచు గంజాయి సేవించి మహిళలను వేధిస్తున్నాడని.. గతంలో పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని స్థానికులు ఆరోపించారు. పోలీసులు చర్యలు తీసుకుని ఉంటే ఈ రోజు ఘటన జరిగి ఉండేది కాదన్నారు. పోలీసుల నిర్లక్ష్యం వల్లే ఈ దారుణం జరిగిందని స్థానికులు అంటున్నారు. సోమవారం రాజు పోలీసులకు లొంగిపోయాడు. రాజును అదుపులోకి తీసుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకున్నారు.
"యువతి మా బంధువు. ఆమె మా ఇంటి ముందు కూర్చున్నప్పుడు రాజు అసభ్యంగా ప్రవర్తించాడు. అమ్మాయి ఏడ్వటంతో అక్కడి నుంచి పారిపోయాడు. సీఎం ఇంటికి మాకు కొద్ది దూరమే.. ముఖ్యమంత్రి ఉండే ప్రాంతంలోనే రక్షణ లేదు. మాములు ప్రాంతాలలో రక్షణ ఎలా ఉంటుంది." -యువతి బంధువు
యువతి హత్యపై చంద్రబాబు స్పందన : తాడేపల్లిలోని సీఎం నివాసానికి కూత వేటు దూరంలోనే యువతి హత్య జరగటం దారుణమని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. అంధురాలని వేధించటం, హతమార్చటం దిగ్భ్రాంతిని కలిగించిందన్నారు. ముఖ్యమంత్రి ఇంటికి సమీపంలోనే రౌడీ షీటర్లు, గంజాయి ముఠాలు, బ్లేడ్ బ్యాచ్లు, యువతి హత్య ఇవన్నీ.. రాష్ట్ర శాంతిభద్రతల దుస్థితికి నిదర్శనమన్నారు.
ఇవీ చదవండి :