కరోనా మహమ్మారి కమ్మేసిన వేళ.. భయం లేకుండా చికిత్స అందిస్తూ.. రోగులకు ఊపిరి పోస్తున్న వైద్యుల సేవలు అసామాన్యం. అందులోనూ యువ వైద్యులు చాలా కీలకంగా వ్యవహరిస్తున్నారు. గుంటూరు జీజీహెచ్‌లో 150 మంది జూనియర్ డాక్టర్లు, 225 మంది హౌస్ సర్జన్లు, 50 మంది వరకు జనరల్ డాక్టర్లు ఉన్నారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు బీపీ, పల్స్ రేటు, ఆక్సిజన్, రక్త పరీక్షలు చేయడం నుంచి... రోగుల పరిస్థితిని యువ వైద్యులు నిత్యం పర్యవేక్షిస్తున్నారు. పీపీఈ కిట్లు వేసుకుని, షిఫ్టుల వారీగా రోజుకు 9 నుంచి 10 గంటలపాటు పనిచేస్తున్నారు.
కరోనా సెకండ్ వేవ్‌లో ఎక్కువమంది ఊపిరితిత్తులపై ప్రభావం పడుతోంది. ఇలాంటివారి పరిస్థితిని అనుక్షణం గమనిస్తూ, ప్రమాదం నుంచి బయటపడేసేందుకు యువవైద్యులు కృషి చేస్తున్నారు. లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయవద్దని, వెంటనే పరీక్ష చేయించుకోవాలని సూచిస్తున్నారు. తీవ్రత తక్కువ ఉన్న సమయంలోనే వైద్యం అందిస్తే ప్రాణాలు కాపాడుకోవచ్చని అంటున్నారు.
వేసవి కారణంగా డ్యూటీలో ఉన్నంతసేపూ పీపీఈ కిట్లు ధరించడం కష్టంగా ఉన్నా..రోగులకు బాసటగా నిలవాలనే సంకల్పంతో యువవైద్యులు అన్నింటినీ భరిస్తున్నారు. ప్రభుత్వం తమకు అవసరమైన కొన్ని సౌకర్యాలు కల్పిస్తే మరింత సమర్థంగా పనిచేయగలమని చెబుతున్నారు. వ్యాక్సినేషన్ చాలా ముఖ్యమని యువవైద్యులు అంటున్నారు. టీకా వేసుకున్నవాళ్లలో 70 నుంచి 80 ఏళ్ల వయసువారు కూడా కరోనా నుంచి త్వరగా కోలుకుంటున్నట్లు చెబుతున్నారు. అందువల్ల ఎవరూ భయపడకుండా వీలైనంత త్వరగా వ్యాక్సిన్ తీసుకోవాలని సూచిస్తున్నారు.
ఇదీ చదవండి: