అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అల్లుడు మంజునాథరెడ్డి.. అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కుంచనపల్లిలోని తన నివాసంలో ఆయన మరణించారు. కొంత కాలంగా మంజునాథరెడ్డి... భార్యతో కలిసి... స్థానిక అవంతి అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం 6 గంటల సమయంలో ఆయన మరణించినట్లు తెలిసింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేరు. మూడు రోజుల క్రితం అపార్ట్‌మెంట్‌కు వచ్చిన మంజునాథరెడ్డి... శుక్రవారం శవమై కనిపించారు. మంజునాథరెడ్డి ఆత్మహత్య చేసుకున్నారని సామాజిక మాధ్యమాల్లో తొలుత విస్తృత ప్రచారం జరిగింది. కానీ ఘటనా స్థలంలో పరిస్థితులు, స్థానికులు చెబుతున్న అంశాలను పరిశీలిస్తే.... ఇది అనుమానాస్పద మృతిగానే కనిపిస్తోంది. మంజునాథరెడ్డి ఫ్లాట్ బాధ్యతలు చూసే నరేంద్ర రెడ్డి... సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు ఇంటి లోపలికి వచ్చాడని... ఆ తర్వాత కొద్దిసేపటికి అంబులెన్స్ వచ్చిందని స్థానికులు చెబుతున్నారు. ఈ వ్యవహారంపై పోలీసులూ గోప్యత వహిస్తున్నారన్న ఆరోపణలు.. మరిన్ని అనుమానాలకు తావిస్తున్నాయి. మంజునాథరెడ్డి గుత్తేదారు కాగా.. ఆయన భార్య వైద్యురాలు. నాలుగేళ్ల క్రితం వీరికి వివాహమయింది.
తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు: తండ్రి మహేశ్వర్‌రెడ్డి ఫిర్యాదుతో పప్పిరెడ్డి మంజునాథరెడ్డి మృతిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కుటుంబసమస్యలు, అప్పుల ఒత్తిడితో ఆత్మహత్యకు పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. పోస్టుమార్టం కోసం మంజునాథరెడ్డి మృతదేహాన్ని మంగళగిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
ఇవి చదవండి: మళ్లీ అధికారంలోకి రాలేనని జగన్ రాష్ట్రాన్ని కోలుకోలేని దెబ్బతీస్తున్నారన్న యనమల