YCP Leaders Illegal Sand Mining: ఇసుక ప్రజలందరికీ చెందాల్సిన ప్రకృతి సంపద అన్నట్టు కాకుండా, వైసీపీ పెద్దల సొంత ఆస్తి అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. జేపీ సంస్థ ముసుగులో ప్రస్తుతం రాష్ట్రంలో ఇసుక వ్యాపారమంతా అధికార పార్టీ నాయకులే నిర్వహిస్తున్నారన్నది బహిరంగ రహస్యం. దీనిపై ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు, పోరాటాలు చేసినా.. వైసీపీ నాయకుల ఇసుక దోపిడీని పత్రికలు ఆధారాలతో సహా బయటపెట్టినా ప్రభుత్వంలో కనీస స్పందన లేదు. ఇసుక అక్రమాలపై ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం సోమవారం నుంచి మూడు రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేసింది. ప్రభుత్వం విపక్ష నేతలను గృహనిర్బంధం చేసి, గొంతు నొక్కేయాలని చూస్తోందే తప్ప వాస్తవాల్ని చెప్పడంలేదు.
YCP leaders are Running sand Business under guise of JP Organization: జేపీ సంస్థ ఈ ప్రభుత్వానికి ముద్దు బిడ్డ కాబట్టి, పేరుకే జేపీ గుత్తేదారు సంస్థ తప్ప ఇసుక దందా మొత్తం అధికార పార్టీ నాయకులదే కాబట్టి, ఆ సంస్థకు ప్రభుత్వం ఎన్నికల వరకు గడువు పొడిగించే ఉండొచ్చు. ప్రభుత్వం చేతిలో పనే కాబట్టి గడువు పొడిగింపు పెద్ద విషయం కానే కాదు! కానీ ఆ విషయాన్ని కూడా ప్రభుత్వం అత్యంత రహస్యంగా ఉంచడమే అనేక సందేహాలకు ఆస్కారమిస్తోంది. ఇసుక తవ్వకాలకు ఉపగుత్తేదారుగా వ్యవహరించిన సంస్థ ప్రభుత్వానికి 302.45 కోట్ల బకాయి పడిందని స్వయంగా జేపీ సంస్థ బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలకు తాజాగా సమర్పించిన త్రైమాసిక ఫైనాన్షియల్ ఆడిట్ నివేదికలో పేర్కొంది. ఆ బకాయిలపై ప్రభుత్వం పెదవి విప్పడం లేదు. జేపీ సంస్థకు జీఎస్టీ రిజిస్ట్రేషన్ నంబర్‌ను సంబంధిత శాఖ రద్దుచేసి, మళ్లీ ఇటీవలే పునరుద్ధరించింది.
NGT and Supreme Court orders are unheeded: ప్రభుత్వం నుంచి సమాచారం తెలుసుకోవడం ప్రజలకు రాజ్యాంగం కల్పించిన హక్కు. దాని కోసం ప్రత్యేక చట్టమే ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపక్షాలకు, మీడియాకే ఎలాంటి సమాచారం అందకుండా ఇనుప తెరలు వేసేశారు. ఇక సామాన్య ప్రజలను పట్టించుకునే పరిస్థితి ఉంటుందా. ప్రభుత్వ అస్తవ్యస్త నిర్ణయాలు, తప్పులు ప్రజలకు తెలిసిపోతాయన్న భయంతో జీవోల్ని ఆన్‌లైన్‌లో పెట్టడం మానేశారు. కోర్టు చెప్పినా లెక్కలేదు. జేపీ సంస్థకు ఇసుక తవ్వకాల కాంట్రాక్ట్ పొడిగింపు, ఈసీల వ్యవహారంలోనూ అత్యంత రహస్యం పాటిస్తున్నారు.
Excavation without environmental clearances: రాష్ట్రంలో ఇసుక తవ్వకాలు, విక్రయాలు జరిపేందుకు జేపీ పవర్ వెంచర్స్ సంస్థకు కాంట్రాక్ట్ గడువు పొడిగించారా? ఇసుక తవ్వకాలకు పర్యావరణ అనుమతులు తీసుకున్నారా? అని గనులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదిని.. ఈటీవీ, ఈనాడు ప్రశ్నించింది. నో కామెంట్, దానిపై నేనేమీ మాట్లాడను. గనులశాఖ డైరెక్టర్‌ను అడగండంటూ ఆయన బదులిచ్చారు. మరీ అంత బాధ్యతారాహిత్యమా? పోనీ గనులశాఖ డైరెక్టర్ నుంచే సమాచారం తెలుసుకుందామని ప్రయత్నిస్తే, ఆయన చాలా రోజుల నుంచి సెలవులో ఉన్నారు. ఫోన్‌లోనూ అందుబాటులోకి రావడం లేదు. అనారోగ్య కారణాల వల్ల ఆయన సెలవులో ఉన్నారని, అందుకే ఆయన ఎవరితో మాట్లాడటం లేదని చెబుతున్నారు. కిందిస్థాయి అధికారులెవర్నైనా కదిపితే.. ఆ విషయాలు మాట్లాడాలంటేనే వణికిపోతున్నారు.
Supreme Court orders on sand mining in AP: ఇసుక దోపిడీ ఏ స్థాయిలో జరగకపోతే, దానిలో ప్రభుత్వ పెద్దల పాత్ర ఎంతగా లేకపోతే.. అంత రహస్యం పాటిస్తారు? అధికారులు అంతగా వణికిపోతారు? ఇసుక వ్యాపారం మొత్తాన్ని ప్రైవేటు గుత్తేదారు సంస్థ చేతుల్లో పెట్టడం వల్ల ప్రభుత్వానికి ఏటా 760 కోట్ల ఆదాయం వస్తోందని ప్రభుత్వ పెద్దలు గొప్పలు చెబుతున్నారు. వైసీపీ పెద్దలు ఈ నాలుగేళ్లలో ఇసుకలో 40 వేల కోట్లు దోచేశారని ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆరోపిస్తున్నారు. గుత్తేదారు సంస్థ ప్రభుత్వానికి 302.45 కోట్లు ఎగవేసిందని ప్రధాన ప్రతిపక్షం ఆధారాలతో బయటపెట్టినా ప్రభుత్వం నుంచి స్పందన లేదు.