Worst Condition in Jagananna Colonies : జగనన్న కాలనీల ద్వారా పేదల సొంతింటి కల నెరవేరుస్తున్నామంటూ పదే పదే ప్రచారం చేసుకుంటున్నా వైసీపీ ప్రభుత్వం లబ్ధిదారులు నివాసం ఉండేందుకు అవసరమైన కనీస మౌలికవసతులు కల్పనను మాత్రం గాలికి వదిలేసిందని కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. తుపాను ప్రభావంతో రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు పడరాని పాట్లు పడుతున్నామంటున్నారు. గుంటూరులోని లాం జగనన్న కాలనీలో 7 వేల మంది లబ్ధిదారులకు సెంటు చొప్పున ప్రభుత్వం గృహాలు మంజూరు చేసింది. కాలనీల్లో కనీసం రోడ్డు వేయకపోవడంతో వర్షాలకు నీట మునిగి కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. కనీసం అడుగు వేసేందుకు కూడా వీలు లేనంత అధ్వానంగా రహదారులు మారాయి. తుపాను ప్రభావంతో రాత్రి నుంచి పడుతున్న వర్షాలకు నిర్మాణాల్లో ఉన్న గృహాలు, ఖాళీ ప్రదేశాల్లో రెండు అడుగుల ఎత్తులో నీరు చేరిందని లబ్ధిదారులు వాపోతున్నారు.
ఏళ్లు గడుస్తున్నా ముందుకు సాగని జగనన్న కాలనీ ఇళ్ల నిర్మాణాలు - నరకయాతన అనుభవిస్తున్న లబ్ధిదారులు
Houses of Incomplete Jagananna Colony : లాం జగనన్న కాలనీల్లో వెయ్యికి పైగా ఇళ్ల నిర్మాణం పూర్తికాగా దాదాపు 150 కుటుంబాలు ఇక్కడే నివాసం ఉంటున్నాయి. మరో వెయ్యికి పైగా ఇళ్ల నిర్మాణం కొనసాగుతోంది. కానీ ఇక్కడ తాగునీరు, రహదారులు నిర్మాణం చేపట్టకపోవడంతో నివాసం ఉండేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ఇతరుల ఇళ్ల నిర్మాణాలు మధ్యలో ఆగిపోవడంతో పిచ్చి చెట్లు ఏపుగా పెరిగి విషకీటకాలతో ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందేమోనని లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. తుపాను ప్రభావంతో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు ప్రకటించడంతో కాలనీవాసులు కొందరు ఇక్కడ ఉండేందుకు భయపడి తమ బంధువుల దగ్గరకు వెళ్లిపోయారు. మరికొందరు నగరంలోని స్నేహితుల ఇళ్లకు వెళ్లిపోయారు. కొద్ది మంది మాత్రం బిక్కుబిక్కు మంటూ ఇళ్లలోనే గడుపుతున్నారు.
జగనన్న కాలనీల్లో ప్రధాన రహదారి మాత్రమే వేశారు. అంతర్గత కాలనీ రోడ్డులు నిర్మించకపోవడంతో లబ్ధిదారులు వానలకు వర్షపు నీరు నిలిచి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గుంతల్లో వాన నీరు చేరడంతో పాటు రహదారులు బురదమయం కావడం ద్విచక్రవాహనాల మీద వెళ్లలేక అవస్థలు పడుతున్నారు. చెరువుల్ని తలపిస్తున్న దారుల్లో నడిచే వెళ్లే సాహసం చేయలేక పనులు మానుకుని ఇళ్లకే పరిమితం కావాల్సి వస్తోందని స్థానికులు వాపోతున్నారు. తాగేందుకు మంచి నీరు కూడా లభించకపోవడంతో చిన్నపిల్లలతో నానా అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Worst Condition in Jagananna Colonies: చెరువుల్లా జగనన్న కాలనీలు.. జనసైనికుల పడవ ప్రయాణం
రోడ్లు దారుణంగా ఉండి రాకపోకలు అతిపెద్ద సమస్యగా మారడంతో లక్షలాది రూపాయలు వెచ్చించి కట్టుకున్న ఇళ్లను సైతం వదిలి నగరంలో అద్దెకు ఉంటున్నామని లబ్ధిదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. లాం జగనన్న కాలనీల్లో వీలైనంత త్వరగా రహదారుల్ని బాగు చేసి విద్యుత్తు సౌకర్యం, తాగునీటి సదుపాయం వంటి మౌలిక వసతుల్ని కల్పించాలని కోరుతున్నారు.