గుంటూరు జిల్లా కొల్లిపర మండలం చక్రాయపాలెంలో నడిరోడ్డు మీద ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. గ్రామానికి చెందిన చందు సామ్రాజ్యం వడ్డీ వ్యాపారి వీరయ్య దగ్గర దాదాపు రూ. 20లక్షలు అప్పుచేసింది. ఆ డబ్బును ఆమె బయట వడ్డీలకు తిప్పుతుండేది. తమ అప్పు తీర్చాల్సిందిగా వీరయ్య, అతని భార్య నర్సమ్మ.. సామ్రాజ్యాన్ని అడిగేవారు. డబ్బుకు బదులుగా పొలాన్ని వారి దగ్గర తాకట్టు పెట్టారు.
ఈరోజు మళ్లీ సొమ్ము విషయంలో గొడవ తలెత్తింది. కోపోద్రిక్తులైన వీరయ్య, అతని భార్య కలిసి సామ్రాజ్యం కళ్లల్లో కారం కొట్టి, గడ్డపారతో దాడిచేశారు. అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపై చంపేశారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన సామ్రాజ్యం భర్తపైనా దాడిచేయగా.. గాయాలయ్యాయి. అతనిని తెనాలి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
వడ్డీవ్యాపారులు డబ్బుకు బదులుగా పొలం, ఇల్లు బలవంతంగా రాయించుకుని... అన్యాయంగా తమ బిడ్డను చంపేశారని సామ్రాజ్యం తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి... తండ్రి, కుమార్తెపై మారణాయుధాలతో దాడి!